
డెహ్రడూన్: దేశంలో సింహాల సంఖ్యను లెక్కించేందుకు శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని కనుగొన్నారు. దీంతో వాటి సంరక్షణ చర్యలు సమర్థంగా చేపట్టొచ్చని చెబుతున్నారు. సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా గుజరాత్‌లోని గిర్ అడవుల్లో ఉన్న 50 ఆసియా సింహాల సంఖ్య ప్రస్తుతం 500 వరకు పెరిగినట్లు వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కేశబ్ వివరించారు. ప్రస్తుతం ఉన్న లెక్కింపు విధానాల వల్ల కొన్ని సింహాలను లెక్కించకపోవచ్చు. లేదా డబుల్ కౌంటింగ్ జరగొచ్చు.. దీనివల్ల వాటి సంఖ్య వివరాలు పరిమితంగానే తెలుస్తాయి. అందుకే ఆయన సహచరులు కలసి కంప్యూటర్ ప్రోగ్రాం ఉపయోగించి లెక్కించే కొత్త విధానాన్ని రూపొందించారు. ఈ విధానంలో సింహం ముఖంపై ఉన్న మీసాలు, శరీరంపై ఉన్న మచ్చల ఆధారంగా గుర్తిస్తారు. సింహాల ఆహార లభ్యత, ఇతర కారకాలు సింహాల సంఖ్యను ప్రభావితం చేసే అవకాశం ఉందని కేశబ్ చెప్పారు. తాజా అధ్యయనంలో గిర్ అడవుల్లో 368 సింహాల్లో 67 సింహాలను 725 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో గుర్తించారు.