17న వైద్యుల దేశవ్యాప్త సమ్మె

Indian Medical Association declares nationwide strike on June 17 - Sakshi

ధర్నాలు, శాంతియాత్రలకు ఐఎంఏ పిలుపు

కొనసాగుతున్న పశ్చిమ బెంగాల్‌ జూడాల ఆందోళనలు

న్యూఢిల్లీ/కోల్‌కతా: ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) మూడురోజుల పాటు జరిగే వైద్యుల దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలను శుక్రవారం ప్రారంభించింది. పశ్చిమబెంగాల్‌లోని ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యులపై దాడిని నిరసిస్తూ ఆందోళనలకు దిగిన వైద్యులకు సంఘీభావంగా ఈ ప్రదర్శనలు చేపట్టింది. అదేవిధంగా ఈ నెల 17న దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మెకు పిలుపునిచ్చింది. అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో అవుట్‌ పేషంట్‌ విభాగాలతో పాటు అత్యవసరం కాని వైద్య సేవలన్నిటినీ 24 గంటల పాటు నిలిపివేయాలని సూచించింది.

అయితే అత్యవసర, క్యాజువాలిటీ సేవలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపింది. ఆస్పత్రుల్లో వైద్యులపై దాడులను నిరోధించేందుకు కేంద్ర చట్టం తేవాలనే తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు ఐఎంఏ లేఖ రాసింది. నిరసన కార్యక్రమాల్లో భాగంగా వైద్యులంతా నల్లబ్యాడ్జీలు ధరించాలని, ధర్నాలు, శాంతియాత్రలు నిర్వహించాలని సూచించింది. కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్‌ వైద్య కళాశాలలో డాక్టర్‌ పరిబాహ ముఖర్జీ తదితరులపై దాడిని ఖండిస్తున్నట్లు ఐఎంఏ సెక్రటరీ జనరల్‌ ఆర్వీ అశోకన్‌ చెప్పారు. నిందితులపై బెంగాల్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, రెసిడెంట్‌ డాక్టర్ల చట్టబద్ధమైన డిమాండ్లన్నిటినీ బేషరతుగా అంగీకరించాలని కోరారు.    

నాలుగో రోజుకు చేరిన సమ్మె
ప్రభుత్వాసుపత్రుల్లో తమకు భద్రత కల్పించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్లో జూనియర్‌ డాక్టర్లు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరింది. సమ్మె విరమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హెచ్చరించినప్పటికీ వాటిని వైద్యులు బేఖాతరు చేశారు. వైద్యులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేంతవరకు విధుల్లో చేరేది లేదని తేల్చి చెప్పారు.  మరోవైపు బెంగాల్‌ జూనియర్‌ డాక్టర్ల సమ్మెకు సంఘీభావంగా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రులకు చెందిన 100 మందికి పైగా సీనియర్‌ డాక్టర్లు రాష్ట్ర వైద్య విద్య సంచాలకులకు తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. కాగా వైద్యుల సమ్మెకు ముఖ్యమంత్రి మమత మేనల్లుడు, వైద్య విద్యార్థి కూడా అయిన అబేష్‌ బెనర్జీ మద్దతుగా నిలవడం విశేషం.

బెంగాలీ నేర్చుకోవాల్సిందే
కాంచ్‌రాపార: పశ్చిమ బెంగాల్లో నివసిస్తున్నవారు ఎవరైనా బెంగాలీలో మాట్లాడటం నేర్చుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. శుక్రవారం ఉత్తర 24 పరగణాల జిల్లా కాంచ్‌రాపార సభలో ఆమె మాట్లాడారు. ‘మనం బంగ్లా భాషను ముందుకు తీసుకురావాలి. ఢిల్లీ వెళ్లినప్పుడు హిందీ మాట్లాడతాం. నేను అలాగే చేస్తా. తమిళనాడు వెళ్లినప్పుడు నాకు తమిళ భాష తెలియదుగానీ కొన్ని పదాలు తెలుసు. అలాగే మీరు బెంగాల్‌వస్తే బెంగాలీలో మాట్లాడాల్సిందే’ అని అన్నారు.   

సమ్మె వెనుక బయటి వ్యక్తులు
రాష్ట్రంలో వైద్యుల సమ్మె వెనుక కొందరు బయటి వ్యక్తుల ప్రమేయం ఉందని మమత అన్నారు. తాను గురువారం ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిని సందర్శించినప్పుడు ప్రభుత్వానికి, తనకు వ్యతిరేకంగా నినదిస్తున్నవారిలో కొందరు బయటివ్యక్తులను తాను చూశానని చెప్పారు. కొందరిలా వాస్తవాలు నిర్ధారించుకోకుండా తాను మాట్లాడనని ఆస్పత్రిని సందర్శించిన సినీ నిర్మాత అపర్ణాసేన్‌ను ఉద్దేశించి మమత వ్యాఖ్యలు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top