పెట్టుబడులకు స్వర్గధామం.. భారత్‌

India ideal investment destination, says PM Modi - Sakshi

వనరుల వినియోగంతో సత్వరాభివృద్ధి సాధ్యం

ఉత్తరాఖండ్‌ ఇన్వెస్టర్స్‌ సమిట్‌లో ప్రధాని మోదీ

డెహ్రాడూన్‌: దేశంలో ప్రస్తుతం కీలక సామాజిక, ఆర్థిక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, పెట్టుబడులకు ప్రపంచంలోనే అత్యంత అనుకూలంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘డెస్టినేషన్‌ ఉత్తరాఖండ్‌: ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2018’ను ఆదివారం ఇక్కడ ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దేశంలో మునుపెన్నడూ లేనంతగా సామాజిక, ఆర్థిక మార్పులు సంభవిస్తున్నాయి. వచ్చే దశాబ్దాల్లో భారత్‌ ప్రపంచ ఆర్థిక చోదక శక్తిగా మారుతుంది’ అని విశ్వాసం వ్యక్తం చేశారు.

‘ఆర్థిక లోటు, ద్రవ్యోల్బణం తగ్గాయి. దేశంలో మధ్య తరగతి ప్రజల సంఖ్య, ఆర్థిక వృద్ధి పెరిగాయి. గడిచిన నాలుగేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్న కనీసం 10వేల చర్యల వల్ల దేశంలో వ్యాపార అవకాశాలు గణనీయంగా పెరిగాయి’ అని తెలిపారు. స్వాతంత్య్రం తర్వాత దేశంలో చేపట్టిన అతిపెద్ద పన్ను సంస్కరణ జీఎస్టీ అమలు. దీని ఫలితంగా దేశమంతా ఒకే మార్కెట్‌గా మారిపోయింది’ అని తెలిపారు. ‘మౌలిక రంగం వేగంగా అభివృద్ధి చెందింది. దేశవ్యాప్తంగా దాదాపు 10వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది.

ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సౌకర్యాలు పెరిగాయి. దేశవ్యాప్తంగా 100 కొత్త హెలిప్యాడ్‌లు, విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయి. మా దేశంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను కోరుతున్నా. ఇది కేవలం భారతీయుల కోసమే కాదు, ప్రపంచం కోసం కూడా’ అని ప్రధాని అన్నారు. రాష్ట్రాల్లో అద్భుత వనరులున్నాయంటూ ఆయన.. వాటిని సక్రమంగా వినియోగించుకుంటే జరిగే అద్భుత అభివృద్ధిని ఏశక్తీ ఆపలేదన్నారు. అనేక యూరప్‌ దేశాలను అధిగమించవచ్చన్నారు. ఉత్తరాఖండ్‌లో పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం ఉన్నందున తమ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలను కోరారు. దేశంలోనే ఆధ్యాత్మిక పర్యావరణ జోన్‌(స్పిరిట్యువల్‌ ఎకో జోన్‌)గా అవతరించేందుకు రాష్ట్రంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు.

దక్షిణ కొరియా మోడల్‌
ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యతలు చేపట్టినప్పటి తన అనుభవాన్ని వివరించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత జరిగిన మీడియా సమావేశంలో కొందరు విలేకరులు నన్ను తికమకపెట్టేందుకు యత్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు వీరు ఎలాంటి మోడల్‌ను అనుసరించాలనుకుంటున్నారు అని నన్ను అడిగారు. వెంటనే నేను దక్షిణ కొరియాను ఆదర్శంగా తీసుకుంటానని చెప్పా. నా సమాధానం వారికి అర్థం కాలేదు. దక్షిణకొరియా విస్తీర్ణం, నైసర్గిక స్వరూపం దాదాపు గుజరాత్‌ మాదిరిగానే ఉంటాయి కాబట్టే ఆ దేశాన్ని మోడల్‌గా తీసుకున్నానని వారికి వివరించా’ అని అన్నారు.

వ్యవసాయం, అగ్రిబిజినెస్‌తోపాటు ఆర్గానిక్‌ వ్యవసాయానికి ఉత్తరాఖండ్‌లో మంచి అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ రంగంలో పెట్టుబడులతో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయవచ్చన్నారు. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వాణిజ్యవేత్తలు ఎంతో ఆసక్తి చూపుతున్నారన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆదానీ, మహింద్రా గ్రూప్‌ సంస్థలు, జేఎస్‌డబ్ల్యూ, అమూల్, పతంజలి వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడులు, ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు తెలిపారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top