అడుగడుగునా అడ్డుకున్నారు

India gets second consular access to Kulbhushan Jadhav - Sakshi

కుల్‌భూషణ్‌ జాధవ్‌ను స్వేచ్ఛగా మాట్లాడనివ్వలేదు 

భారత అధికారులకు ఆటంకాలు కల్పించారు 

పాకిస్తాన్‌పై భారత్‌ ధ్వజం

న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్‌ నిర్బంధంలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌ను కలుసుకునేందుకు తమ దౌత్యాధికారులకు స్వేచ్ఛాయుత, బేషరతు అనుమతి ఇవ్వలేదని భారత్‌ గురువారం ఆరోపించింది. జాధవ్‌ను కలుసుకునేందుకు వెళ్లిన అధికారులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందని విమర్శించింది. జాధవ్‌ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించిందని తెలిపింది. 

దాంతో, పాక్‌ ఇచ్చిన దౌత్య అనుమతి అర్థరహితంగా మారిందని పేర్కొంటూ ఆ అధికారులు తమ నిరసనను అక్కడే వ్యక్తం చేశారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘జాధవ్‌ను భారత దౌత్యాధికారులు కలుసుకున్న సమయంలో.. నిబంధనలకు విరుద్ధంగా పాక్‌ అధికారులు ఆ ప్రదేశానికి అత్యంత సమీపంలో ఉన్నారు. బెదిరించే ధోరణిలో వారు  ప్రవర్తించారు. భారతీయ అధికారులు నిరసన తెలిపినా వారు పట్టించుకోలేదు. దాంతో జాధవ్‌తో స్వేచ్ఛగా సంభాషించే వీలు లభించలేదు. అదీకాకుండా, జాధవ్‌తో భారత అధికారుల సంభాషణను రికార్డు చేశారు.

అందుకు అక్కడే ఉన్న కెమెరానే సాక్ష్యం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ వివరించారు. పాకిస్థాన్‌ సైనిక కోర్టు జాదవ్‌కు విధించిన మరణ శిక్షపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయడానికి ఈ నెల 20 వరకు మాత్రమే గడువున్న తరుణంలో గురువారం సాయంత్రం జాదవ్‌ను కలుసుకోవడానికి భారత అధికారులకు పాక్‌   అనుమతించింది. పాకిస్తాన్‌ మిలటరీ కస్టడీలో ఉన్న జాదవ్‌ను కలుసుకున్న అధికారులు రెండు గంటల సేపు చర్చించారు. రివ్యూ పిటిషన్‌కు సంబంధించి ఆయన నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకుందామని భావిస్తే అక్కడి అధికారులు అడ్డుపడ్డారని శ్రీవాస్తవ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top