వాయుసేన అమ్ములపొదిలో అపాచీ యుద్ద హెలికాప్టర్లు | Sakshi
Sakshi News home page

వాయుసేన అమ్ములపొదిలో అపాచీ యుద్ద హెలికాప్టర్లు

Published Tue, Sep 3 2019 11:51 AM

IAF gets its first fleet of 8 Apache attack helicopters - Sakshi

న్యూఢిల్లీ:  భారత వాయుసేన ఆధునీకరణ దిశగా పెద్ద ముందడుగు పడింది. వాయుసేన అమ్ములపొదిలోకి తాజాగా ఎనిమిది అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లు వచ్చి చేరాయి. అమెరికాలో తయారైన అపాచీ ఏహెచ్‌-64ఈ (ఐ) హెలికాప్టర్లు మంగళవారం భారత్‌ చేరాయి. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లో వీటిని వాయుసేన స్వాధీనం చేసుకుంది. వాయుసేనకు చెందిన125 హెలికాప్టర్‌ యూనిట్‌ ’గ్లాడియేటర్స్‌’  ఈ అత్యాధునిక హెలికాప్టర్లు వినియోగించనున్నారు. వాయుసేన అమ్ములపొదిలోకి ఈ హెలికాప్టర్లు చేరిన సందర్భంగా వాటిని ఐఏఎఫ్‌ చీఫ్‌ బీఎస్‌ ధనోవా, ఎయిర్‌ మార్షల్‌ ఆర్‌ నంబియార్‌ పరిశీలించారు.  అమెరికా నుంచి ఈ యుద్ధ హెలికాప్టర్లను భారత్‌ దిగుమతి చేసుకొంది. వీటిని కొనుగోలు చేసేందుకు 2015లోనే భారత్‌ అమెరికా రక్షణ సంస్థ బోయింగ్‌తో 1.1 బిలియన్‌ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2022నాటికి భారత వాయుసేనలోకి మొత్తం 22 అపాచీయుద్ధ హెలికాప్టర్లు వచ్చి చేరనున్నాయి. మొత్తం నాలుగు దశల్లో వీటిని బోయింగ్‌ భారత్‌కు అప్పగించనుంది. ప్రస్తుతం భారత వాయుసేన సోవియట్‌ నాటి ఎంఐ-25, ఎంఐ 35 హెలికాప్టర్లను వినియోగిస్తోంది. వీటి స్థానంలో అపాచీ హెలికాప్టర్లను వాయుసేన ఇకనుంచి వినియోగించనుంది. పాకిస్థాన్‌ సరిహద్దులకు కొద్ది దూరంలోనే ఉన్న పఠాన్‌ కోట్‌ ఎయిర్‌బేస్‌లో ఈ యుద్ధ హెలికాప్టర్లలోని నాలుగింటిని వాయుసేన మోహరించనుంది.


Advertisement
 
Advertisement