కూపీ లాగితే ‘సీబీఐ’ డొంక కదులుతోంది!

How Rakesh Asthana Went From Super Cop To CBI Special Director - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర నేర పరిశోధనా సంస్థ (సీబీఐ) నేడు ఇంతగా భ్రష్టుపట్టి పోవడానికి కారకులు ఎవరు? అందుకు బాధ్యులు ఎవరు? సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాపై అవినీతి ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్‌ దాఖలయితే ఆయనపై మాత్రమే చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆయనతోపాటు సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మపై కూడా ఎందుకు చర్యలు తీసుకుంది? ఇద్దరిని బలవంతపు సెలవు మీద ఎందుకు పంపించింది? అసలు గుజరాత్‌ ఐపీఎస్‌ క్యాడర్‌కు చెందిన రాకేశ్‌ అస్థానా సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ స్థాయికి ఎలా ఎదిగారు? ఆయన నియామకాన్ని సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఎందుకు సవాల్‌ చేశారు? ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు అభిమాన పాత్రుడు ఎలా అయ్యారు? మోదీకి అస్థానాను పరిచయం చేసిందెవరు? అస్థానా ఇంతవరకు డీల్‌ చేసిన కేసులేమిటీ? 2016లో వడోదరలో విలాసవంతమైన తన కూతురు పెళ్లి వేడకులకు డబ్బులు ఖర్చు పెట్టిందెవరు? చివరకు తానే ఓ కేసులో పీకల దాకా ఎలా కూరుకుపోయారు? ఆ కేసేమిటీ?

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ తనకు ఆదర్శ నాయకుడని చెప్పుకునే రాకేశ్‌ అస్థానా తనకు తాను ‘ఉక్కు మనిషి’ని అని చెప్పుకుంటారు. ఆయన్ని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్, సుభాశ్‌ చంద్రబోస్, వివేకానందుడినితో పోలుస్తూ 2018, ఏప్రిల్‌ నెలలో ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొట్టింది. అస్థానానే తనకు తాను అలా ప్రమోట్‌ చేసుకున్నారని అప్పుడు ఆరోపణలు వచ్చాయి. హవాలా కేసులో ‘స్టెర్లింగ్‌ బయోటెక్‌’ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకొన్న ‘డైరీ ఆఫ్‌ 2011’ కేసులో ఆస్థానా నిందితుడు.

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి రాజకీయ ప్రత్యర్థుల ప్రమేయం ఉన్న ‘అగస్ట వెస్ట్‌ల్యాండ్‌’ రక్షణ కుంభకోణం, హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా వీరభద్ర సింగ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై, భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన విజయ్‌ మాల్యా, రాజస్థాన్‌ అంబులెన్స్‌ కుంభకోణం లాంటి కేసులను విచారించడం ద్వారా అస్థానా పేరు బాగా వెలుగులోకి వచ్చింది. అంతకంటే 2002లో ‘గోద్రా రైలు దుర్ఘటన’ కేసును దర్యాప్తు జరిపిన సిట్‌కు నాయకత్వం వహించిందీ అశోక్‌ అస్థానానే. 2002, ఫిబ్రవరి 27వ తేదీన కర సేవకుల బోగీలు తగులబడి 58 మంది మరణించిన విషయం తెల్సిందే. 2002, మార్చి నెలలో దాఖలైన మొదటి చార్జిషీటులో రైలు ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందని పేర్కొన్నారు. ఈ బోగీలను ముస్లింలు తగులబెట్టారన్న వార్తల కారణంగానే గుజరాత్‌ అంతటా అల్లర్లు చెలరేగడం, రెండువేల మందికి పైగా మరణించడం తెల్సిందే.

అప్పటి మోదీ నాయకత్వంలోని గుజరాత్‌ ప్రభుత్వం 2002, మే నెలలో రాకేశ్‌ అస్థానా నాయకత్వాన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. జూలై 9వ తేదీ నాటికల్లా కేసు దృక్కోణమే మారిపోయింది. రైలు ప్రమాదం ప్రమాదవశాత్తు జరగలేదని, స్థానిక ముస్లిం వ్యాపారి ఒకరు కుట్రపన్ని రైలు బోగీలను తగులబెట్టారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆ మేరకు 2002, సెప్టెంబర్‌ నెలలో ఛార్జిషీటు దాఖలయింది. 2003, ఫివ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘ప్రివెన్షన్‌ ఆఫ్‌ టెర్రరిజమ్‌ యాక్ట్‌’ కింద నిందితులపై అభియోగాలు మోపారు. కేంద్రంలోని యూపీఏ హయాంలో 2005లో ‘పోటా’ రివ్యూ కమిటీ పోటా ఆరోపణలను కొట్టివేసింది. గోద్రా కేసు విచారణ మాత్రం వివిధ కోర్టుల్లో అనేక ఏళ్లపాటు కొనసాగింది. 2011లో ట్రయల్‌ కోర్టు 11 మంది నిందితులకు మరణశిక్ష, 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2017లో గుజరాత్‌ హైకోర్టు మరణ శిక్షలను యావజ్జీవ శిక్షలుగా మార్చింది.

అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసును కూడా
2008లో సంచలనం సృష్టించిన అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసు దర్యాప్తు బృందానికి కూడా అస్థానానే ఇంచార్జీగా వ్యవహరించారు. నగరంలో నాడు సంభవించిన 22 పేలుళ్లలో 56 మంది అమాయకులు మరణించారు. నరేంద్ర మోదీ ‘సెక్యూరిటీ’ అనే నినాదంపైనే వరుసగా రెండో సారి ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. ఆ కేసు దర్యాప్తులో మరో పోలీసు అధికారి అభయ్‌ చుడాసమా కూడా ముక్యపాత్ర వహించారు. అప్పుడు అస్థానా బరోడా పోలీసు కమిషనర్‌గా పనిచేస్తుండగా, అభయ్‌ డిప్యూటీ పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. 2005లో జరిగిన షొహ్రాబుద్దీన్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో అభయ్‌ చుడాసమ ప్రధాన నిందితుల్లో ఒకరు. ‘ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమీ)’ విద్యార్థులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారని అస్థానా బృందం చివరకు తేల్చింది.

అద్వానీతో పరిచయం
లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బిహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన్ని పశుదాణా కేసులో విచారించి ఆయనపై చార్జిషీటు దాఖలవడానికి బాధ్యుడయ్యాడని ప్రశంసలు అందుకున్న అస్థానా 2000 సంవత్సరంలో ఎల్‌కే అద్వానీకి పరిచయం అయ్యారు. అద్వానీ గుజరాత్‌కు వచ్చినప్పుడు ఆయనకు సెక్యూరిటీ ఆఫీసర్‌గా వెళ్లిన అస్థానా, తనకుతాను పరిచయం చేసుకొని తాను సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అభిమానినని, ఆ తర్వాత తమనూ అభిమానిస్తానని చెప్పారట. 2002లో అద్వానీ స్వయంగా తన వెంట తీసుకెళ్లి అస్థానాను మోదీకి పరిచయం చేశారట.

ఢిల్లీకి పిలుపు..
2014లో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొంత కాలానికే ఢిల్లీకి బదిలీ చేస్తూ అస్థానాకు ఉత్తర్వులు అందాయి. 2017లో ఆయన్ని సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘స్టెర్లింగ్‌ బయోటెక్‌’ హవాలో కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అస్థానాను సీబీఐ అధికారిగా ఎలా నియమిస్తారంటూ ‘కామన్‌ కాజ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సుప్రీం కోర్టులో కేసు వేశారు. దాన్ని తొలుత సుప్రీం కోర్టు కొట్టి వేయగా, మళ్లీ రివ్యూ పిటీషన్‌ దాఖలు చేశారు.

3.83 కోట్ల ముడుపులు
స్టెర్లింగ్‌ బయోటెక్‌ కంపునీ నుంచి సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న డైరీలో రాకేశ్‌ అస్థానాకు 3.83 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చినట్లు నమోదై ఉంది. ఈ డైరీ ఆధారంగానే ఆ కంపెనీపై సీబీఐ 2017లోనే చార్జిషీటు దాఖలు చేసినప్పటికీ అందులో అస్థానా పేరును పేర్కొనలేదు. 2016లో వడోదరలో వైభవంగా జరిగిన కూతురు పెళ్లికి పెళ్లి వేదిక నుంచి భోజనాల వరకు ‘స్టెర్లింగ్‌ బయోటెక్‌’ కంపెనీ వర్గాలే స్పాన్సర్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. గత జూలై నెలలో అలోక్‌ వర్మ విధి నిర్వహణలో భాగంగా దూరప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆయనకు చెప్పకుండా, ఆయన అనుమతి లేకుండా అస్థానా సీబీఐలో కొత్త నియామకాలు జరిపారు. వర్మ వచ్చాక ఈ విషయమై కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

ఈడీ దాడులతో
స్టెర్లింగ్‌ బయోటెక్‌ కంపెనీ డైరెక్టర్లు చేతన్, నితిన్‌ సండేసర ఆస్తులపై ఎన్‌పోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సెప్టెంబర్‌ నెలలో దాడులు చేయడంతో మరోసారి ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ హవాల కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా అస్థానా తనను వేధిస్తున్నారని, ఐదు కోట్ల రూపాయలు చెల్లిస్తే కేసు లేకుండా చూస్తానని చెబుతున్నారంటూ హైదరాబాద్‌కు చెందిన సతీష్‌ సనా అనే వ్యాపారి సీబీఐకే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న సీబీఐ డైరెక్టర్‌ వర్మ అక్టోబర్‌ 15వ తేదీన అస్థానాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే వర్మ రాజకీయ పక్షపాతి అని, అవినీతికి పాల్పడుతున్నారంటూ అస్థానా కూడా కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌కు లేఖ రాశారు.

ఇద్దరిపై ఆరోపణలు వచ్చినందునే..
సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ అస్థానాపై అవినీతి ఆరోపణలు వస్తే ఆయనపై చర్య తీసుకోవాలిగానీ, డైరెక్టర్‌ అలోక్‌ వర్మపై ఎందుకు చర్య తీసుకున్నారని విలేకరులు ప్రశ్నించగా, ఇద్దరిపై అవినీతి ఆరోపణలు వచ్చినందున ఇద్దరిపై చర్యలు తీసుకున్నామని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు సీబీఐ డైరెక్టర్‌పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదు. ఆయన నీతివంతుడు, నిజాయితీపరుడంటూ బీజేపీ ఎంపీ సుబ్రమణియం ప్రశంసించడం ఇక్కడ గమనార్హం. ఓ నిందుతుడు చేసిన కౌంటర్‌ ఆరోపణలను పరిగణలోకి తీసుకున్నారంటే అరుణ్‌ జైట్లీకి వివేకమెంతుందో ఆయనకే తెలియాలి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top