‘బాలకోట్‌’లో జరిగిన నష్టం ఎంత?

How Much Damage With Balakot Air Strike - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్‌ చెరలో చిక్కిన భారత వైమానిక దళం వింగ్‌ కమాండర్‌ అభినందన వర్థమాన్‌ను సురక్షితంగా విడుదల చేయాలని పాకిస్థాన్‌ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో ఇరు దేశాల మధ్య గత మూడు రోజులుగా నెలకొన్ని యుద్ధ మేఘాలు విడిపోయాయి. అయితే పలు చిక్కు ప్రశ్నలకు సమాధానాలు రావల్సి ఉంది. (అణు యుద్ధం వస్తే..?)

1. ఈ మూడు రోజులుగా దేశ సరిహద్దులో పాక్‌ నుంచి నిరంతరంగా కొనసాగుతున్న కాల్పులు, శతఘ్ని పేలుళ్లు నిలిచిపోతాయా? కాల్పులకు భయపడి ఉన్నఫలంగా సురక్షిత ప్రాంతాలకు తరలివచ్చిన సరిహద్దు గ్రామాల ప్రజలు తిరిగి తమ స్వగ్రామాలకు వెళ్లే పరిస్థితి ఉందా? కశ్మీర్‌ లోపల గత కొంతకాలంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తొలగిపోతాయా?

2. పాక్‌ భూభాగంలోని బాలకోట్‌ ఉగ్ర స్థావరంపై భారత వైమానిక దాడుల వల్ల జరిగిన ధ్వంసం ఏమిటీ? ఉగ్రవాదులు ఎంత మంది చనిపోయారు ? వారు తిరిగి కోలుకొని తమ ఉగ్రశిక్షణ కేంద్రాన్ని పునరుద్ధరించుకునే అవకాశం ఉందా? భారత్‌ దాడితో పాక్‌ వైఖరిలో ఏమైనా మార్పు వస్తుందా? ఇంతటితో ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు పాకిస్థాన్‌ ప్రభుత్వమే చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఈ విషయమై ఇరువర్గాలు ఇప్పటి వరకు ఎలాంటి వివరాలను, ఆధారాలను వెల్లడించలేదు.

3. పాక్‌ జెట్‌ యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి ఎలా చొచ్చుకు రాగలిగాయి? వాటిని తరముతూ వెళ్లిన భారత యుద్ధ విమానాన్ని పాక్‌ సైనికులు ఎలా పడగొట్టగలిగారు?

4. బుద్గామ్‌లో ఏడుగురు మరణానికి దారితీసిన భారత సైనిక విమానం మిగ్‌–17 కూలిపోవడానికి కారణం ఏమిటీ? (పాక్‌ జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిందా?)

5. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు నెలకొన్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ తమ రాజకీయ కార్యకలాపాలను రద్దు చేసుకోగా, ప్రధాని నరేంద్ర సహా పాలకపక్ష బీజేపీ తమ రాజకీయ కార్యకలాపాలను ఎందుకు కొనసాగించారు?

6. అభినందన్‌ను పాక్‌ ప్రభుత్వం విడుదల చేయడం వెనక నిజంగా సౌదీ అరేబియా, అమెరికా ఒత్తిడి ఉందా? ఉన్నట్లయితే విదేశీ మీడియా ఈ అంశాన్ని పూర్తిగా ఎందుకు విస్మరించింది?

6. పాక్‌ భూభాగంపై ఉగ్రవాద శిక్షణా స్థావరాలను సమూలంగా నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ? వీటన్నింటికి సమాధానం దొరకాల్సి ఉంది. (‘అష్ట’దిగ్బంధనం..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top