
మయన్మార్‌లో రఖైన్ రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. రెండు ప్రైవేట్ స్కూళ్లపై సైన్యం గగనతల దాడి జరిగింది. ఈ ఘటనలో 19 మంది విద్యార్థులు మృతి చెందగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. మిలిటెంట్లు ఉన్నారనే సమాచారంతో పాఠశాలలపై దాడి జరిగింది. ఈ దాడి విద్యార్థులు నిద్రపోతున్న సమయంలో జరిగింది. గత ఏడాది రఖైన్‌లో కొంత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న అరకాన్ ఆర్మీ (ఎఎ) మయన్మార్ పాలక సైన్యంతో భీకర యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.
క్యుక్తావ్ టౌన్‌షిప్‌లోని రెండు ప్రైవేట్ పాఠశాలలపై శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన దాడిలో విద్యార్థులు మృతి చెందినట్లు అరకాన్ ఆర్మీ శనివారం టెలిగ్రామ్ పోస్టులో వెల్లడించింది. కాగా, ఈ దాడిని యునిసెఫ్ తీవ్రంగా ఖండించింది. రఖైన్ రాష్ట్రంలో హింస రోజురోజుకు పెరుగుపోతుందని.. చిన్నారులు, కుటుంబాలు భారీ మూల్యం చెల్లిస్తున్నాయని యూనిసెఫ్ ఆవేదన వ్యక్తం చేసింది.