మిలటరీ విమానంలో ఢిల్లీకి 270 మంది భారతీయులు
న్యూఢిల్లీ: మయన్మార్‌లో స్కామ్ సెంటర్ నుంచి పరారై సరిహద్దుల్లోని థాయ్‌ల్యాండ్ పట్టణం మే సొట్‌లో తలదాచుకున్న 270 మంది భారతీయులు గురువారం సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు మిలటరీ రవాణా విమానాల్లో వారిని తీసుకువచ్చింది. మయన్మార్‌లోని మ్యావద్డీ నగరంలోని కేకే పార్క్‌లో ఉన్న సైబర్‌క్రైం హబ్‌పై అక్కడి అధికారులు దాడులు జరిపి అక్కడున్న సిబ్బందిని విడిపించారు.
ఇందులో సుమారు 500 మంది భారతీయులు సహా 28 దేశాలకు చెందిన మొత్తం 1,500 మంది ఉన్నారు. అంతా కలిసి సరిహద్దుల్లోని థాయ్‌ల్యాండ్ పట్టణం మే సొట్‌కు చేరుకున్నారు. అక్రమంగా ప్రవేశించిన ఆరోపణలపై అక్కడి అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. సైబర్ మోసాల్లో భాగస్వాములుగా మారిన వీరిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు థాయ్‌ల్యాండ్, మయన్మార్‌లలోని భారత రాయబార కార్యాలయాలు అక్కడి ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపాయి.
ఈ చర్చలు సఫలం కావడంతో వైమానిక దళానికి చెందిన రెండు విమానాల్లో మొదటి విడతలో 26 మంది మహిళలు సహా 270 మంది ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో అక్కడ బాధితులుగా మారిన వారు, నేరాల్లో పాలుపంచుకున్న వారు ఉన్నారు. అధికారులు వీరిని ప్రశ్నించే అవకాశముంది. విదేశీ ఏజెంట్ల వలలో ఎలా పడ్డారు? అక్కడ ఎలాంటి విధులు నిర్వహించారు? వంటి వివరాలను తెలుసుకుంటారు. మయన్మార్‌లో స్కామ్ సెంటర్‌లు అనేక దేశాల్లో విస్తరించి ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా, థాయ్‌ల్యాండ్‌లో ఉన్న మిగతా వారి కోసం మరిన్ని విమానాలను పంపుతామని అధికారులు తెలిపారు.


