కొత్త మంత్రులు.. ఆ నలుగురు మాత్రం స్పెషల్‌

కొత్త మంత్రులు.. ఆ నలుగురు మాత్రం స్పెషల్‌ - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లో కొత్తగా అడుగుపెట్టబోతున్న తొమ్మిది మందిలో నలుగురు వ్యక్తుల పేర్లు ప్రత్యేకంగా వినిపిస్తున్నాయి. సమర్థవంతమైన అధికారులుగా పేరున్న వీరి బయోడేటాను ఓసారి పరిశీలిస్తే...

 

హర్‌దీప్‌ సింగ్‌ పూరి: ఇండియన్ ఫారిన్‌ సర్వీస్‌ మాజీ అధికారి. ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్లు 1974 బ్యాచ్‌కు చెందిన హర్‌దీప్‌ ఐక్యరాజ్యసమితిలో ఇండియా తరపున శాశ్వత ప్రతినిధిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన రీసెర్చ్‌ అండ్ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ డెవలపింగ్ కంట్రీస్‌ థింక్‌ థాంక్‌కు చైర్మన్‌గా, న్యూయార్క్‌లోని అంతర్జాతీయ శాంతి సంస్థకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్‌ ఇండియా తరపు ప్రతినిధిగా, కౌంటర్ టెర్రరిజం కమిటీకి చైర్మన్‌గా కూడా ఆయన పని చేశారు.

 

కేజే అల్ఫోన్స్: ‘విధ్వంసకార అధికారి’గా ఆయనకు పేరుంది. ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌గా విధులు నిర్వహించిన సమయంలో అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపటంతో ఆయనకు ఆ పేరు వచ్చిపడింది. అటుపై కేరళ కొట్టాయంలో పలు అభివృద్ధి పనులను చేయటం ఆయన ట్రాక్‌ రికార్డులో నమోదయ్యింది. కేరళ 1979 ఐఏఎస్‌ బ్యాచ్‌ కు చెందిన ఆల్ఫోన్స్ 2006 లో సర్వీస్‌కు గుడ్‌ బై చెప్పి సీపీఐ(ఎం) మద్ధతుదారుడిగా కంజిరాపల్లి నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. అయితే ఐదేళ్ల తర్వాత ఆయన బీజేపీలో చేరిపోయారు. ఆరెస్సెస్‌-క్రిస్టియన్‌ గ్రూపుల మధ్య సంధానకర్తగా ఆయన వ్యవహరించారు కూడా. 

 

రాజ్‌కుమార్‌ సింగ్‌(ఆర్కే సింగ్): 1975 ఐఏస్‌ బ్యాచ్‌కు చెందిన రాజ్‌కుమార్‌. హోం సెక్రటరీగా(2011-13) విధులు నిర్వహించారు. 2014 లో బీజేపీలో చేరిన ఆయన బిహార్‌లోని ఆర్రా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సిబ్బంది, పింఛన్లు, ప్రజా ఫిర్యాదులపై ఏర్పాటైన వివిధ పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో సభ్యుడిగా పని చేశారు. మొదట్లో బీజేపీతో ఆయన సత్సంబంధాలు అంతగా లేవు. 1990లో సమస్తిపూర్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించిన సమయంలో అప్పటి బిహార్ ముఖ్యమంత్రి లాలూ ఆదేశాలతో.. అయోధ్య రథయాత్రను అడ్డుకుని మరీ అద్వానీని సింగ్‌ అరెస్ట్ చేశారు. అంతేకాదు 2015 బిహార్ ఎన్నికల సమయంలో క్రిమినల్స్ కు సీట్లు కేటాయించటంపై బహిరంగంగానే అసంతృప్తిని వెల్లగక్కి అధిష్ఠానం దృష్టిలో్ నిజాయితీపరుడిగా ముద్ర పడిపోయారు. 

 

సత్యపాల్‌ సింగ్‌: మహారాష్ట్ర కేడర్‌కు చెందిన మాజీ ఐపీఎస్‌ అధికారి. పెద్ద గుండాగా తనని తాను అభివర్ణించుకుంటూ కమిషనర్‌గా ఆయన ముంబైని గడగడలాడించారు. సంచలనం సృష్టించిన ఇష్రాత్‌ జహన్‌ ఎన్‌కౌంటర్‌ కేసును 2011 జూన్‌లో ప్రభుత్వం సింగ్‌కు అప్పజెప్పింది. అయితే తోటి అధికారులతో విభేదాల మూలంగా ముందుకు సాగలేనని ముక్కుసూటిగా చెప్పేసి ఆయన విచార బృందం నుంచి బయటకు వచ్చేశారు.

 

ఏపీ, మధ్యప్రదేశ్‌లలో నక్సలైట్ల నియంత్రణకు కృషిచేసినందుకు 1990లో ప్రత్యేక సేవా పతకాన్ని అందుకున్నారు. 2014లో బీజేపీలో చేరిన ఆయన ఉత్తర ప్రదేశ్‌ లోని బాగ్‌పత్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆర్‌ఎల్‌డీ చీఫ్‌ అజిత్ సింగ్ పై ఆయన విజయం సాధించటం విశేషం. హోం శాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలో సభ్యుడిగా, లాభదాయక పదవుల సంయుక్త కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు.


 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top