అసోంలో భారీ వర్షాలు : ఆరుగురు మృతి

Heavy  Rain Fall In Assam - Sakshi

గువాహటి : అసోంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. వరదల ఉధృతికి ఇప్పటికే ఆరుగురు మృత్యువాత పడగా.. ఎనిమిది లక్షలమందికి పైగా ప్రభావితులయ్యారు. మొత్తం 33 జిల్లాలకు 21 జిల్లాలలో వరద ప్రభావం కొనసాగుతోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోడానికి ముఖ్యమంత్రి సర్బనంద సోనోవాల్‌ సంబంధిత జిల్లాల డిప్యూటి కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి సహాయం కోసం ఎదురు చూసే ప్రజల సమస్యలపై స్పందించాలని ఆదేశించారు. మరోవైపు జౌళీశాఖ మంత్రి ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ప్రస్తుత పరిస్థితిపై ఆరాతీశారు. 

దేశంలోనే అతి పెద్ద నదులలో ఒకటైన బ్రహ్మపుత్ర నదితోపాటు మిగతా అయిదు నదులు కూడా ఉధృతంగా పారుతుండటంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు అధికారులు వెల్లడించారు. వరదల కారణంగా రాష్ట్రంలో 27000 హెక్టార్లలో  పంట పొలాలు నీట మునిగియాని, ఈ క్రమంలో 68 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి ఏడు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు.ఈ వర్షాలు వారమంతా కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అదే విధంగా రాష్ట్రంలో శుక్రవారం నుంచి బోటింగ్‌ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. 

ఇక టీ తోటలు అధికంగా ఉన్న ధేమాజీ, లంఖింపూర్‌ ప్రాంతాలు వరద ప్రభావానికి దెబ్బతిన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు ప్రవహించడం వల్ల లోతైన ప్రాంతాలు నీట మునిగాయి. భారీగా కురిసిన వర్షాలకు కాజీరంగ జాతీయ ఉద్యానవనంలోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో జంతువులకు రక్షణ కల్పించేందుకు వాటికి ఏర్పాటు చేసిన స్థావారాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. ప్రమాదాలను అరికట్టేందుకు ఉద్యానవనం చుట్టూ ఉన్న జాతీయ రహదారిపై వేగ పరిమితిని విధించారు. రాష్ట్రంలో ఎన్సెఫాలిటిస్‌ బాధితులు పెరిగి పోతుండటంతో సెప్టెంబర్‌ చివరి వరకు ఆరోగ్యశాఖ ఉద్యోగులకు ప్రభుత్వం సెలవులను నిషేధించింది. ఈ వ్యాధి అక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటివరకు 700 మందికి పైగా ఈ వ్యాధితో మరణించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top