లాక్‌డౌన్‌లో పెళ్లి... లాక్‌అప్‌లో జంట! | Sakshi
Sakshi News home page

వధూవరుల అరెస్ట్‌ ఎందుకంటే...

Published Sat, Apr 18 2020 9:34 AM

In Gujarat  Bride Groom Among 14 People Arrested for Violating Lockdown Norms - Sakshi

అహ్మదాబాద్‌: కరోనా మహమ్మారి కోరల్లో చిక్కకొని ప్రపంచం మొత్తం విలవిలలాడిపోతుంది. దీని కారణంగా చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ బాధపడుతున్నారు. ఈ మహమ్మారి కరాళ నృత్యం చేస్తుంటే దానిని అడ్డుకోవడానికి అనేక దేశాలు లాక్‌డౌన్‌ని కూడా ప్రకటించాయి. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. ఎవ్వరూ అవసరం ఉంటే  తప్ప ఇళ్ల నుంచి బయటకు రావడంలేదు. దాదాపు అత్యవసర సర్వీసుల్లో ఉన్న వైద్య సిబ్బంది, పోలీసులు, మీడియా వాళ్లు తప్ప ఎవరూ రోడ్లపై కనిపించడం లేదు. భారతదేశంలో కరోనా కట్టడికి మార్చి 24న ప్రధాని నరేంద్రమోదీ లాక్‌డౌన్‌ను ప్రకటించారు. ఈ లాక్‌డౌన్‌ సమయం ఏప్రిల్‌ 14న ముగిసింది. అయితే అప్పటికి భారత్‌లో కరోనా కేసులు ఎక్కువ కావడంతో లాక్‌డౌన్‌ను మే3 వరకు పొడిగిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. దేశం మొత్తం కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని ఆదేశించారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో చెబుతున్నా కూడా కొందరు పెడచెవిన పెడుతున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ పోలీసులు చేతికి చిక్కుతున్నారు. తాజాగా గుజరాత్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి చేసుకున్న వధూవరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. (లాక్డౌన్: 4.6 లక్షల ఫోన్కాల్స్)

గుజరాత్‌లోని నవ్సారికి చెందిన వధూవరులు స్థానిక దేవాలయంలో కుటుంబసభ్యులు 14 మందితో కలిసి  శుక్రవారం పెళ్లి  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వధూవరులతోపాటు 14మంది బంధువులను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన గురించి నవ్సారి ఎస్పీ గిరీష్‌ పాండ్యా మాట్లాడుతూ ‘ఇక్కడ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి 14 మంది గుంపుతో పెళ్లి జరిపిస్తున్నారని సమాచారం అందింది. వెంటనే ఇక్కడికి చేరుకొని వారందరిని అరెస్ట్‌ చేశాం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’  అని తెలిపారు. (ముందు నెగిటివ్.. తర్వాత పాజిటివ్ రిపోర్టు)

ఇక ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 22,40,191 మంది కరోనా బారిన పడగా 1,53,822 మంది మరణించారు. ఇక భారతదేశం విషయానికి వస్తే 13,835 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 1,767 మంది రికవరీ అయ్యారు, 452 మంది మరణించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 766కుపైగా కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 534 కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement