అభివృద్ధికి రహదారి

Govt increases highways budget by 6%, allocates Rs 83k crore  - Sakshi

రోడ్ల నిర్మాణంలో అత్యంత వేగవంతమైన పురోగతి

న్యూఢిల్లీ: రోజుకు సగటున 27 కి.మీ మేర రహదారులు నిర్మిస్తూ ఈ రంగంలో భారత్‌ అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేసిందని పీయూష్‌ గోయల్‌ చెప్పారు. వచ్చే 8 ఏళ్లలో 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని భారత్‌ ఉవ్విళ్లూరు తోందని చెప్పారు. మధ్యంతర బడ్జెట్‌ చారిత్రకమైనదని రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ స్వాగతించారు. దీని ద్వారా 40–50 కోట్ల మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు నేరుగా ప్రయోజనం పొందుతారని చెప్పారు. మౌలిక వసతులకు కేటాయింపులు, ప్రతిపాదిత ప్రాజెక్టులు, పూర్తయిన ప్రాజెక్టులపై తాజా బడ్జెట్‌లో గోయల్‌ ప్రస్తావించిన విషయాలు..

► రోడ్లు, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, పట్టణ రవాణా, గ్యాస్‌–విద్యుత్‌ సరఫరా, జలరవాణా మార్గాల లాంటి రంగాల్లో తరువాతి తరం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

► ఢిల్లీ, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌లలో ఏళ్లుగా నిలిచి పోయిన వంతెన ప్రాజెక్టులు పూర్తయ్యాయి.

► రోడ్ల నిర్మాణానికి రూ.83 వేల కోట్లు కేటాయించారు.

►  బ్రహ్మపుత్ర నదిలో నౌకాయానాన్ని అభివృద్ధిచేస్తే.. ఈశాన్య ప్రాంతానికి కూడా జలమార్గం గుండా సరుకు రవాణా చేసేందుకు సాధ్యమవుతుంది.

► కోల్‌కతా నుంచి వారణాసికి తొలిసారిగా దేశీయంగా జలరవాణా ద్వారా సరుకు రవాణా ప్రారంభమైంది.

► రైల్వే చరిత్రలోనే ఈ ఏడాది అత్యంత సురక్షితమైనదిగా గడిచింది.

►  సిక్కింలోని పాక్యాంగ్‌ విమానం అందుబాటులోకి వచ్చాక దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 100కు చేరింది.

► స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌’తో ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సేవలు, వేగం, భద్రత అందుబాటులోకి వస్తాయి. ఈ సాంకేతికతతో మన ఇంజినీర్లు మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి ఊతమిస్తున్నారు.

తాజా బడ్జెట్‌లో రైల్వేలకు సమకూర్చిన మూలధనం: 64,587కోట్లు
రైల్వేల మొత్తం మూలధన వ్యయం విలువ: 1,58,658 కోట్లు

► అరుణాచల్‌ప్రదేశ్‌లో విమానయాన సేవలు, మేఘాలయ, త్రిపుర, మిజోరంలలో రైల్వే మార్గాల అనుసంధానత ఇటీవలే ప్రారంభమయ్యాయి.

► ఈ మేరకు ఈశాన్య భారత్‌లో కేటాయింపులు 21 శాతం పెరిగి రూ.58, 166 కోట్లకు చేరుకున్నాయి.

► వచ్చే ఐదేళ్లలో లక్ష గ్రామాలను డిజిటల్‌ గ్రామాలుగా తీర్చిదిద్దాలని లక్ష్యం.

► 15.80 లక్షల ఇళ్లను పక్కా రోడ్లతో అనుసంధానించారు. మిగిలిపోయిన సుమారు 2 లక్షల ఇళ్లకు కూడా ఈ సౌకర్యం కల్పించేందుకు పనులు జరుగుతున్నాయి.

► ఈసారి పీఎంజీఎస్‌వైకి కేటాయించిన మొత్తం రూ.19,000 కోట్లు.

► 2014–18 మధ్యకాలంలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద 1.53 కోట్ల ఇళ్లను నిర్మించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top