వినియోగదారులకు మరో బురిడీ

Govt hikes excise duty on petrol by Rs 10 per litre and diesel by Rs 13 - Sakshi

పెట్రోల్, డీజిల్‌పై మళ్లీ ఎక్సైజ్‌ సుంకం మోత

కేంద్రానికి రూ.1.6 లక్షల కోట్ల అదనపు రాబడి 

అంతర్జాతీయంగా ధరలు తగ్గినా.. ప్రజలకు చేరింది సున్నా

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 20 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోగా, ఆ ప్రయోజనాన్ని మన ప్రభుత్వాలు వినియోగదారులకు చేరనివ్వడం లేదు. సొంత ఖజానాలో జమ చేసుకుంటున్నాయి. ముడి చమురు ధరలు తగ్గితే పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గాల్సింది పోయి కొన్ని రాష్ట్రాల్లో  పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం తాజాగా ఎక్సైజ్‌ సుంకం పెంచగా, కొన్ని రాష్ట్రాలు విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌) పెంచాయి. లీటర్‌ పెట్రోల్‌పై రూ.10, లీటర్‌ డీజిల్‌పై రూ.13 చొప్పున కేంద్రం ఎక్సైజ్‌ సుంకం పెంచింది. పెట్రోల్, డీజిల్‌ మొత్తం ధరలో పన్నుల వాటా 70 శాతానికి చేరింది.

ఈ పెంపుతో ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి దాదాపు రూ.1.6 లక్షల కోట్ల అదనపు ఆదాయం రానుంది. ప్రస్తుతం ఎక్సైజ్‌ సుంకం పెంచినప్పటికీ వినియోగదారులపై ఎలాంటి ప్రభావంపడదు. ఇప్పుడున్న పెట్రోల్, డీజిల్‌ ధరల్లో మార్పు ఉండదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధర పడిపోయింది. ఆ లాభాన్ని పొందుతున్న ఆయిల్‌ కంపెనీల నుంచి ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్రం వసూలు చేయనుంది. రెండు నెలల కంటే తక్కువ వ్యవధిలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం పెంచడం ఇది రెండోసారి. సుంకాన్ని కేంద్రం పెంచకపోయి ఉంటే చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్‌ ధరలు కొంతైనా తగ్గించేందుకు ఆస్కారం ఉండేది. దాంతో వినియోగదారులకు ప్రయోజనం చేకూరేది.  

రాష్ట్రాల నిర్వాకం  
పెట్రోల్, డీజిల్‌పై ఢిల్లీ ప్రభుత్వం వ్యాట్‌ను పెంచేసింది. దీంతో అక్కడ పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.1.67, డీజిల్‌ ధర రూ.7.10 చొప్పున పెరిగింది. దీనివల్ల ఢిల్లీ సర్కారుకు రూ.700 కోట్ల అదనపు ఆదాయం రానుంది. తమిళనాడు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ పెంపు ద్వారా రూ.2,500 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హరియాణా సర్కారు సైతం పెట్రోల్‌పై రూపాయి, డీజిల్‌పై రూ.1.1 చొప్పున వ్యాట్‌ను పెంచింది. మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాలు ఇప్పటికే వ్యాట్‌ను పెంచాయి.  

 ధరల పెంపును వెనక్కి తీసుకోవాలి: రాహుల్‌ గాంధీ  
ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం వారిపై మరింత భారం మోపుతోందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, పార్లమెంట్‌ సభ్యుడు రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్‌ ధరలను పెంచడం దారుణమని ధ్వజమెత్తారు. ఈ మేరకు బుధవారం హిందీ భాషలో ట్వీట్‌ చేశారు. ఈ ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top