
అప్పులబొప్పి.. ఆదాయం తిరోగమనం
రెవెన్యూ, ద్రవ్యలోటు భారీగా పెరుగుదల
కొత్త ఆర్థిక సంవత్సరం తొలినెల ఏప్రిల్‌లోనే దుస్థితి
గత ఏప్రిల్‌తో పోల్చితే ఈ ఏప్రిల్‌లో జీఎస్టీ ఆదాయం రూ.728 కోట్లు తగ్గుదల
అమ్మకం పన్ను రూ.233 కోట్లు తగ్గింది.. ఎక్సైజ్ డ్యూటీతో పాటు పన్నేతర ఆదాయమూ నేలచూపులు
ఏప్రిల్‌లో బాబు చేసిన బడ్జెట్ అప్పు రూ.13,631 కోట్లు
మూల ధన వ్యయం కేవలం రూ.150 కోట్లు
ఏప్రిల్ నెల బడ్జెట్ గణాంకాలను వెల్లడించిన కాగ్
సాక్షి, అమరావతి: కొత్త ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి నెల ఏప్రిల్‌లోనే రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో సాగుతోంది. గత ఆర్థిక ఏడాది రాష్ట్ర సంపద పెంచడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెంచడంలో మాత్రం సఫలీకృతమవుతున్నారు. 2025–26 ఆర్థిక ఏడాది తొలినెల ఏప్రిల్‌లో జీఎస్టీతో పాటు ఆమ్మకం పన్ను, ఎక్సైజ్ డ్యూటీ, పన్నేతర ఆదాయం అంతకు ముందు ఆర్థిక ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే తగ్గిపోయింది. ఈ విషయాన్ని కాగ్ గణాంకాలే వెల్లడించాయి.
ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నెల బడ్జెట్ గణాంకాలను కాగ్ శనివారం వెల్లడించింది. ఏప్రిల్ ఒక నెలలోనే బడ్జెట్‌లో ఏకంగా రూ.13,631 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. జీఎస్టీ, అమ్మకం పన్ను తగ్గిపోతోందంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోతోందని అర్థమని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే జీఎస్టీ, అమ్మకం పన్నుల్లో వృద్ధి నమోదవుతుందని, లేదంటే ఆదాయం తగ్గిపోతుందని ఆర్థిక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలతో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జీఎస్టీ ఏకంగా రూ.728 కోట్లు తగ్గిపోయింది. అలాగే అమ్మకం పన్ను గత ఆర్థిక ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్‌లో రూ.233 కోట్లు తగ్గిపోయింది. అలాగే ఎక్సైజ్ డ్యూటీతోపాటు, ఇతర పన్నులు, డ్యూటీలు, పన్నేతర ఆదాయం కూడా తగ్గాయి. సాధారణంగా అంతకు ముందు ఆర్థిక ఏడాది కన్నా ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో జీఎస్టీ గానీ, అమ్మకం పన్ను గానీ ఎంతో కొంత మేర పెరగాలి.
అయితే ఎటువంటి విపత్కర పరిస్థితులూ లేకపోయినా ఇవి తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశమేనని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జీఎస్టీ ద్వారా రాబడి మిగతా రాష్ట్రాల్లో పెరుగుతుండగా రాష్ట్రంలో తగ్గుతోందని, దీనికి కారణాలను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. మరో పక్క ఏప్రిల్ ఒక్క నెలలోనే రూ.13,631 కోట్లు అప్పు తెచ్చినప్పటికీ మూల ధన వ్యయం ఏప్రిల్‌లో కేవలం రూ.150 కోట్లు మాత్రమే చేయడం కూడా ఆందోళన కలిగించేదిగా ఉందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరో పక్క ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు పెరిగిపోతున్నాయని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. సంపద సృష్టించి సంక్షేమం, అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు గత ఆర్థిక ఏడాది సంపద సృష్టించకపోగా రాష్ట్ర ప్రజలపై భారీ అప్పుల భారం మోపారు. ఇప్పుడు కొత్త ఆర్థిక ఏడాది తొలి నెలలోనే భారీగా అప్పులు చేశారు తప్ప రాష్ట్ర ఆదాయం పెంచడంలో వెనుకబడిపోయారు. ఇన్ని అప్పులు చేస్తున్నా.. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడం గమనార్హం.
