రైలును మధ్యలోనే ఆపేశాడు

Goods Train Stopped In Mid Way Near Nagapattinam - Sakshi

సాక్షి, చెన్నై: తన డ్యూటీ ముగిసిందంటూ లోకో పైలెట్‌ మార్గమధ్యంలో గూడ్స్‌ రైలును ఆపేసిన ఘటన తమిళనాడులోని నాగపట్నం జిల్లా శీర్గాలి సమీపంలో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం నేలబొగ్గుతో కరైక్కాల్‌ పోర్టు వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలు హఠాత్తుగా శీర్గాలి సమీపంలో ఆగింది. సరిగ్గా లెవల్‌ క్రాసింగ్, రైల్వే గేటుకు మధ్యలో రైలును ఆపేసి లోకో పైలెట్‌ ముత్తురాజ్‌ కిందకు దిగేశాడు. తన డ్యూటీ సమయం ముగిసి అరగంట అవుతున్నా వేరే లోకో పైలెట్‌ రాలేదని, ఇక తాను రైలును ముందుకు నడపనంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తన బ్యాగ్‌ను సర్దుకుని అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యాడు.

ఎంతకూ రైలు ముందుకు కదలకపోవడం, గేటు తెరుచుకోకపోవడంతో వాహనచోదకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రైల్వే గేట్‌మెన్‌ను ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది. సుమారు గంట పాటు గూడ్స్‌ రైలు అక్కడే ఆగడంతో శీర్గాలి – పుంగనూరు మార్గంలో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు వైర్‌లెస్‌ సెట్‌ ద్వారా ముత్తురాజ్‌తో మాట్లాడారు. మైలాడుదురై జంక్షన్‌ వరకు గూడ్స్‌ నడపాలని కోరడంతో ఎట్టకేలకు ముత్తురాజ్‌ గూడ్స్‌ను ముందుకు కదిలించాడు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top