యువరక్తాన్ని చంపుకుంది మనమేనా?

Garud Commados Killed of Bulletproof Helmet Failure: Report

శ్రీనగర్‌ : కఠోర తపస్సు, నిరంతర శిక్షణ, అంకితభావంతో పని చేయాలనే స్ఫూర్తి యువకుల దళమైన ‘గరుడ్‌ కమాండో’ల గ్రూపు శత్రు దుర్భేధ్యమైనదిగా పేరు గాంచింది. అలాంటి దళానికి చెందిన ఇద్దరు కమాండోలు సాధారణ ఎన్‌కౌంటర్‌(ఈ నెల 11వ తేదీన కశ్మీర్‌లో మిలిటెంట్లు, బలగాల మధ్య ఎన్‌కౌంటర్‌)లో ప్రాణాలు కోల్పోయారు.

గరుడ్‌ కమాండోల మృతి దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అందుకు కారణమూ లేకపోలేదు. గరుడ్‌ కమాండో గ్రూపుకు ఎంపికైన వారికి ఇజ్రాయెల్‌, అమెరికాల్లో ప్రత్యేక తర్ఫీదును ఇస్తారు. వాయు సేనకు చెందిన బేస్‌లపై ఉగ్రదాడులు పెరుగుతుండటంతో వాటి రక్షణ కోసం గరుడ్‌ కమాండోల సంఖ్యను 2,500లకు పెంచారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌పై జరిగిన ఉగ్రదాడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది గరుడ్‌ ఎలైట్‌ ఫోర్సే. ఈ ఆపరేషన్‌ ఒక్క గరుడ్‌ కమాండోకు కూడా గాయపడలేదు.

కశ్మీర్‌లో జరిగిన చిన్నపాటి ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గరుడ్ కమాండోలు మిలింద్‌ కిషోర్‌, నిలేశ్‌ కుమార్‌ నయన్‌లు ప్రాణాలు కోల్పోయారు. మిలింద్‌ కిషోర్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ హెల్మెట్‌లోకి లష్కరే ఈ తయ్యబాకు చెందిన ఉగ్రవాదులు కాల్చిన రెండు తూటాలు దూసుకెళ్లాయి. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దీంతో భారతీయ ఎలైట్‌ ఫోర్సెస్‌ వాడుతున్న బుల్లెట్‌ప్రూఫ్‌ హెల్మెట్లపై అనుమానాలు తలెత్తాయి.

గరుడ్‌ కమాండోలు వినియోగిస్తున్న బుల్లెట్‌ ప్రూఫ్‌ హెల్మెట్లు భారతీయ కంపెనీ తయారు చేసినవే. 2015లో వీటిని గరుడ్‌ కమాండోలకు అందజేశారు. హెల్మెట్ల బరువును బట్టి బుల్లెట్లను అడ్డుకునే సామర్ధ్యం పెరుగుతుంటుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ భారతీయ వాయుసేన అధికారి తెలిపారు.

గరుడ్‌ కమాండోలు వినియోగిస్తున్న హెల్మెట్లనే వాయుసేన కూడా వాడాలని అనుకుందని, తాజా ఘటనతో పునరాలోచనలో పడిందని చెప్పారు. నైట్‌ విజన్‌ డివైజెస్‌ను వాడాలంటే హెల్మెట్లను తక్కువ బరువుతో రూపొందించాల్సివుంటుందని వెల్లడించారు. దీనివల్ల దగ్గర నుంచి దాడి జరిగిన సమయంలో కమాండోలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top