ఆ గణపతికి 259 కోట్ల బీమా!! | Sakshi
Sakshi News home page

ఆ గణపతికి 259 కోట్ల బీమా!!

Published Tue, Aug 26 2014 2:59 PM

ఆ గణపతికి 259 కోట్ల బీమా!!

వినాయక చవితి వచ్చేస్తోంది. మహారాష్ట్రలో.. అందులోనూ ముంబై మహానగరంలో సందడికి ఏమాత్రం కొదవ లేదు. అక్కడ ఓ మండపాన్ని ఏకంగా రోజుకు 50 కోట్ల రూపాయలకు బీమా చేశారు. జీఎస్బీ సేవా మండల్ ఆధ్వర్యంలో కింగ్స్ సర్కిల్లో ఏర్పాటుచేసిన ఈ మండపంలో గణపతిని ఐదు రోజుల పాటు ఉంచుతారు. మొత్తం 259 కోట్లకు ఈ మండపాన్ని, అందులో గణపతిని బీమా చేశారు.

కేవలం విగ్రహం మీద ఉన్న బంగారమే దాదాపు 22 కోట్ల రూపాయల విలువైనది కావడంతో ఈ భారీ మొత్తానికి ఇన్సూరెన్స్ చేశారు. ఇందులో విగ్రహానికి, దానిమీదున్న బంగారానికి, మండపానికి, భక్తులకు కూడా బీమా ఉంటుంది. అగ్నిప్రమాదం, ఉగ్రవాద దాడులు, మతకల్లోలాలు.. ఇలా ఏం జరిగినా బీమా మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఉత్సవాలు మొదలైన తొలిరోజు నుంచి బీమా కవరేజి మొదలవుతుంది. చిట్టచివరి రోజున ట్రస్టీలు విగ్రహానికి అలంకరించిన ఆభరణాలను మళ్లీ బ్యాంకు లాకర్లో భద్రపరిచేవరకు కవరేజి కొనసాగుతుంది. ఆ తర్వాతే విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తారు. ఇందుకు తాము చెల్లిస్తున్న ప్రీమియం లక్షల్లోనే ఉంటుంది గానీ, అదెంతో మాత్రం వెల్లడించబోమని జీఎస్బీ మండల్ సీనియర్ ట్రస్టీ సతీష్ నాయక్ తెలిపారు.

మరోవైపు నగరంలో ప్రసిద్ధి చెందిన లాల్బాగ్చా రాజా మండపాన్ని 51 కోట్లకు బీమా చేయించారు. దీనికి 12 లక్షల ప్రీమియం కడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే జీఎస్బీ మండపానికి ప్రీమియం కనీసం 50 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా రెండు కోట్ల పాలసీలకు అయితే 2.5 లక్షల వరకు ప్రీమియం ఉంటుందని, కానీ ఈ మండపాలకు వేరే ప్రీమియం ఉంటుందని ఓ అధికారి చెప్పారు.

Advertisement
Advertisement