
దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అంబరాన్నంటాయి. గణేశ్ చతుర్థిని పురస్కరించుకుని వాడవాడలా గణనాయకుడి విగ్రహాలు కొలువుదీరాయి. ఇక సెలబ్రిటీలు సైతం తమ ఇళ్లలోనే గణపతి పూజ చేసి తరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరిలో టీమిండియా స్టార్లు కూడా ఉన్నారు.

సతీమణితో సూర్య పూజ
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సతీమణి దేవిశా శెట్టితో కలిసి ఇంట్లో వినాయకుడి విగ్రహం ప్రతిష్టించి పూజ చేశాడు. మరోవైపు.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూడా కుటుంబంతో కలిసి గణేశ్ చతుర్థిని సెలబ్రేట్ చేసుకున్నాడు. టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన నివాసంలోనే విఘ్నేశ్వరుడికి పూజలు చేశాడు.

ఇక టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ సైతం భార్య సాగరిక ఘట్కేతో కలిసి ఇంట్లోనే గణేశ్ చతుర్థి సెలబ్రేట్ చేసుకున్నాడు. వినాయకుడికి ఇష్టమైన మోదకాలను నైవేద్యంగా సమర్పించిన సాగరిక- జహీర్ దంపతులు.. తమ నాలుగు నెలల చిన్నారి కుమారుడితో గణేశుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా తమ కుమారుడి ఫొటోను పూర్తిగా రివీల్ చేయగా.. నెట్టింట వైరల్‌గా మారింది.
ఫతేసిన్హ్ ఖాన్‌గా నామకరణం
కాగా బాలీవుడ్ నటి సాగరిక ఘట్కేతో ప్రేమలో పడిన జహీర్ ఖాన్.. 2017లో ఇరు కుటుంబాల అంగీకారంతో ఆమెను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన ఎనిమిదేళ్ల తర్వాత ఈ జంటకు తొలి సంతానంగా కుమారుడు జన్మించాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జహీర్- సాగరిక ఈ విషయాన్ని వెల్లడించారు.

తమ కుమారుడికి ఫతేసిన్హ్ ఖాన్‌గా నామకరణం చేసినట్లు జహీర్- సాగరిక తెలిపారు. కాగా మహారాష్ట్రకు చెందిన జహీర్ ఖాన్ లెఫ్టార్మ్ మీడియం పేసర్‌గా సేవలు అందించాడు. అంతర్జాతీయ స్థాయిలో పద్నాలుగేళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన 46 ఏళ్ల జహీర్.. 92 టెస్టుల్లో 311, 200 వన్డేల్లో 282, 17 టీ20 మ్యాచ్‌లలో 17 వికెట్లు పడగొట్టాడు.
ఇక ఐపీఎల్ కూడా ఆడిన జహీర్ ఖాన్.. క్యాష్ రిచ్ లీగ్‌లో 100 మ్యాచ్‌లలో కలిపి 102 వికెట్లు కూల్చాడు. 2025లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా విధులు నిర్వర్తించిన జహీర్‌కు.. ఈ ఫ్రాంఛైజీ కటీఫ్ చెప్పినట్లు సమాచారం.
చదవండి: DPL: బౌలర్లు ఇక కాస్కోండి.. జూనియర్ సెహ్వాగ్ వచ్చేస్తున్నాడు! వీడియో