
సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(బుధవారం) విజయవాడలో పర్యటించనున్నారు. వినాయకచవితి సందర్భంగా నగరంలోని రాణీగారి తోటలో జరిగే గణనాథుని పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ రాణీగారి తోట (దేవుళ్ళ ఆంజనేయులు స్ట్రీట్, శాంపిల్ బిల్డింగ్) వద్ద జరగనున్న గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి బయలుదేరుతారు.
వినాయక చవితి సందర్భంగా వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని.. ఇంకా గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వైఎస్ జగన్ అభిలషించారు.