ఆహారమా.. పురుగుల మందా?

Food Pollution With Chemicals - Sakshi

ఆరోగ్యాలను నాశనం చేస్తున్న రసాయన పురుగు మందులు

కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఒక సంస్థ సర్వేలో వెల్లడైన నిజాలు

51% ఆహార పదార్థాల్లో పురుగు మందు అవశేషాలు

సాక్షి, హైదరాబాద్‌: మనం నిత్యం తినే ఆహార పదార్థాల్లో పురుగు మందు అవశేషాలు ఉంటున్నాయి. విచ్చలవిడిగా రసాయన పురుగు మందులను వాడటం వల్ల అవి మన ఆరోగ్యాలను నాశనం చేస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రమాదకరమైన కేన్సర్‌ వంటి వ్యాధులకు గురవుతున్నారని కేంద్రం ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘ఇండిపెండెంట్‌ కమిషన్‌ ఆన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ హెల్త్‌ ఇన్‌ ఇండియా’తయారుచేసిన ‘ఏ రోడ్‌ మ్యాప్‌ టూ ఇండియాస్‌ హెల్త్‌’నివేదికలో రసాయన పురుగు మందుల వాడకం వల్ల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాన్ని వెల్లడించింది. ఆ నివేదికను తాజాగా రాష్ట్రాలకు పంపించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు దీనిని అధ్యయనం చేస్తున్నాయి.

రాష్ట్రంలోనూ విచ్చలవిడిగా వాడకం..
కీటకాలు, వివిధ రకాల పురుగుల కారణంగా 15 నుంచి 20 శాతం పంట నష్టం జరుగుతుందని అంచనా. అంటే దాదాపు 1.4 లక్షల కోట్ల రూపాయల విలువైన పంట నష్టపోతున్నాం. అందువల్ల అధికంగా ఆహార పదార్థాలను పండించడం కంటే పండించిన వాటికి నష్టం జరగకుండా చూడటమే కీలకమని భారత పంటల పరిరక్షణ పరిశోధన సంస్థ నిర్దేశించింది. ఈ నేపథ్యంలోనే దేశంలో ఆహార పంటల రక్షణకు క్రిమికీటకాల నుంచి కాపాడేందుకు విరివిగా రసాయన ఎరువుల వాడకం పెరిగిందని నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా హరిత విప్లవం నుంచి వాటి వాడకం పెరిగింది. ప్రస్తుతం భారతదేశంలో ఆహార ఉత్పత్తుల్లో 51 శాతం రసాయన పురుగు మందులతో కలుషితం అవుతున్నాయని నివేదిక వెల్లడించింది. ఇండియాలో ఒక హెక్టారుకు సరాసరి అరకిలో రసాయన పురుగు మందులు వాడుతున్నారు. రాష్ట్రంలోనూ రైతులు పురుగు మందులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. గత నాలుగేళ్లలో దాదాపు రెట్టింపు వినియోగం పెరిగింది.

పురుగు మందు స్ప్రే చేయడం వల్ల...
పురుగు మందు వాడకం వల్ల ఆహారం విషతుల్యమై 1958లో కేరళలో 100 మంది చనిపోయారు. గోధుమ పిండి కలుషితం కావడం వల్ల ఈ ఘోర సంఘటన జరిగింది. ఇటీవల మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోనూ పురుగు మందులను అధికంగా ఉపయోగించిన కారణంగా 45 మంది రైతులు చనిపోయారు. ఆ ప్రాంతంలో చాలా మంది రైతులు పత్తి పండించేవారే. వారంతా పురుగు మందులను స్ప్రే చేయడం వల్ల చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. 
 
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..
రసాయన పురుగు మందుల వాడకం ఫలితంగా ప్రపంచంలో ఏటా 2 కోట్ల మంది పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారు. ప్రపంచంలో పుట్టే పిల్లల్లో 40 శాతం మంది భారత్‌లోనే తక్కువ బరువుతో ఉంటున్నారు. అంతేకాదు పుట్టడానికి ముందే అంటే తల్లి కడుపులో ఉన్న 37 వారాల్లో పిల్లలకు వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు సోకుతున్నాయి. దీర్ఘకాలికంగా ఇది పిల్లలపై పెను ప్రభావం చూపుతుంది. పురుగు మందుల వాడకం విరివిగా పెరిగితే పార్కిన్సన్‌ వ్యాధి రావడానికి అవకాశం ఎక్కువ. పురుషుల్లో పునరుత్పతి సామర్థ్యం తగ్గుతుంది. కిడ్నీలు దెబ్బతింటున్నాయి. లుకేమియా, ఊపిరితిత్తుల కేన్సర్‌ వస్తున్నాయి. ప్రొస్టేట్‌ కేన్సర్‌ రోగుల్లో అధికంగా ఎండోసల్ఫాన్‌ మందు అవశేషాలను గుర్తిస్తున్నారు. కలుపు నివారణకు వాడే ఆక్సిఫురోఫెన్‌ వల్ల కాలేయ సమస్యలు తలెత్తుతాయి. బీజీ–3 పత్తిలో ఉపయోగించే గ్లైపోసేట్‌ వల్ల కేన్సర్‌ సోకే ప్రమాదముంది.


 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top