భారత్‌లో మహమ్మారి తొలి ఫొటోలు విడుదల

First Electron Microscope Image Of Corona Virus From India - Sakshi

ముంబై: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19)కు సంబంధించిన ఫొటోలు భారత్‌లో తొలిసారిగా విడుదలయ్యాయి. ట్రాన్స్‌మిషన్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ను ఉపయోగించి పుణెలోని ఐసీఎమ్‌ఆర్‌-ఎన్‌ఐవీ శాస్త్రవేత్తలు కంటికి కనిపించని సూక్ష్మజీవి ఫొటోలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. జనవరి 30న భారత్‌లో నమోదైన తొలి కరోనా కేసుకు సంబంధించిన థ్రోట్‌ స్వాబ్‌(గొంతుకు సోకిన ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించేందుకు ఉపయోగించే వైద్య పరీక్ష) నుంచి వీటిని సంగ్రహించినట్లు తెలిపారు. కేరళకు చెందిన ఓ వ్యక్తి నుంచి సేకరించిన సాంపిల్స్‌లోని జన్యుక్రమం... చైనాలోని వుహాన్‌లో బయటపడ్డ సార్స్‌-కోవ్‌-2(కరోనా వైరస్‌) జన్యుక్రమంతో 99.98 శాతం సరిపోలిందని ఈ సందర్భంగా వెల్లడించారు.(కరోనా వైరస్‌: ఎందుకంత ప్రమాదకారి?

పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ(ఎన్‌ఐవీ) ఇందుకు సంబంధించిన వివరాలు, ఫొటోలను ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌లో పొందుపరిచారు. ఐసీఎమ్‌ఆర్‌-ఎన్‌ఐవీ నేషనల్‌ ఇన్‌ఫ్లూయెంజా సెంటర్‌ టీం‘‘ట్రాన్స్‌మిషన్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపి ఇమేజింగ్‌ ఆఫ్‌ సార్స్‌-కోవ్‌-2’’పేరిట ఈ ఆర్టికల్‌ను ప్రచురించింది. భారత్‌లో కరోనా వైరస్‌ ఫొటోలను తొలిసారిగా తామే విడుదల చేసినట్లు పేర్కొంది. కరోనా వైరస్‌ కారణంగా శ్వాసకోశ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని ప్రాణాంతక పరిస్థితి సంభవిస్తుందని పేర్కొంది. కాగా నెక్ట్స్ జనరేషన్‌ సీక్వెన్సింగ్‌(ఎన్‌జీఎస్‌) ప్రక్రియ ద్వారా తొలిసారిగా ఈ మహమ్మారిని గుర్తించిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్‌కు సంబంధించిన కచ్చితమైన పరిణామక్రమం, మార్ఫాలజీ(ఆకృతి) గురించి ఇంతవరకు ఏ పరిశోధనల్లోనూ పూర్తి వివరాలు వెల్లడికాలేదు.(మహమ్మారి కోరల్లో 724 మంది)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top