ప్లాస్టిక్‌ వాడితే జైలుకే..!

Fines For Not Following Mumbai Plastic Ban - Sakshi

సాక్షి, ముంబై: ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించడానికి బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎమ్‌సీ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్‌ ఉపయోగించే ప్రజలు, దుకాణాదారులు, మాల్స్‌పై భారీ జరిమానాలు విధించనుంది. నిబంధనలకు విరుద్దంగా ప్లాస్టిక్‌ వినియోగించే వారిపై తొలిసారి ఐదు వేల జరిమానా, రెండో సారి పది వేల జరిమానా, మూడో సారి కూడా వాడితే 25,000 జరిమానాతో పాటు మూడు నెలల జైలు శిక్ష విధించాలని నిర్ణయించింది.

ఈ నిబంధనలు ఆదివారం(జూన్‌ 24) నుంచి అమలులోకి రానున్నాయి. ఆరు నెలల నుంచే ప్లాస్టిక్‌ నిషేధంపై మాల్స్‌, షాపింగ్‌మాల్స్‌, రెస్టారెంట్స్‌, మార్కెట్లలో అవగాహన కల్సిస్తున్నా మార్పు రాకపోవటంతో  భారీ జరిమానాలు విధించాల్సి వచ్చిందని మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ నిధి చౌదరి తెలిపారు. 249 మందితో కూడిన ప్రత్యేక స్క్వాడ్‌.. బీచ్‌లు, బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక నిఘా పెడతారన్నారు. జరిమానా చెల్లింపులలో ఎలాంటి అవినీతి జరగకుండా ఈ-బిల్స్‌ ద్వారా చెల్లించాలని ప్రజలకు డిప్యూటీ కమిషనర్‌ సూచించారు. పలుమార్లు లా కమిటీతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

అవగాహన కార్యక్రమాలు.. ప్లాస్టిక్‌ వాడకం తగ్గించేదిశగా ప్రజలకు అవగాహన కార్యక‍్రమాలను నిర్వహిస్తున్నట్లు బీఎమ్‌సీ తెలిపింది. ఇప్పటికే 60 కంపెనీలు, 80 స్వయం సేవక సంఘాలు ఒక ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసి ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం గురించి వివరిస్తున్నారు. ఇప్పటివరకు మున్సిపల్‌ శాఖ, ఎన్జీవోలు సంయుక్తంగా భారీ ఎత్తున్న ప్లాస్టిక్‌ను సేకరించాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top