మహిళా ఉద్యోగులకు డ్రెస్‌ కోడ్‌పై దుమారం

Female Staff Members Asked To Come Wearing Saari - Sakshi

లక్నో : యూపీలోని ఫతేహబాద్‌లో ఓ సహకార వైద్యారోగ్య కేంద్రంలో అధికారి ఇచ్చిన తాలిబన్‌ తరహా ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. మహిళా సిబ్బంది జీన్స్‌, టీషర్ట్‌లు కాకుండా సల్వార్‌ సూట్‌, చీరలు ధరించి మాత్రమే కార్యాలయానికి రావాలని ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా ఉద్యోగులు పనిచేసేందుకు వచ్చే సమయంలో మేకప్‌ వేసుకోరాదని సూచించారు. ఈ ఉత్తర్వులు మహిళా ఉద్యోగులకే కాదని, పురుషులకూ వర్తిసాయని అధికారులు చెప్పుకొచ్చారు. పురుషులు టీ షర్ట్స్‌, జీన్స్‌తో కార్యాలయానికి హాజరు కాకూడదని స్పష్టం చేశారు.

ఉద్యోగుల సమావేశంలో సహకార వైద్యారోగ్య కేంద్రం ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ మనీష్‌ గుప్తా ఈ నిర్ణయం తీసుకున్నారు. హెల్త్‌ సెంటర్‌ ఉద్యోగులందరూ విధిగా డ్రెస్‌ కోడ్‌ పాటించాలని ఆయన ప్రకటించారు. డ్రెస్‌ కోడ్‌ పాటించడంలో విఫలమైన ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించడం విశేషం. డ్రెస్‌ కోడ్‌ విషయం బయటకు పొక్కడంతో అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులతో ఉద్యోగులు అసలు విషయం చెప్పేందుకు తటపటాయించగా, సదరు అధికారి మాత్రం ఈ ఉత్తర్వులు పొరపాటుగా జారీ అయ్యాయని సర్ధిచెప్పుకునే ప్రయత్నం చేశారు. డ్రెస్‌ కోడ్‌పై ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు ఎవరూ జారీ చేయలేదని చీఫ్‌ మెడికల్‌ అధికారి డాక్టర్‌ ముఖేష్‌ వివరణ ఇచ్చారు. డ్రెస్‌ కోడ్‌ ప్రకటించిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top