కన్నీళ్లు చూసి కూడా వారి మనసు కరగలేదు!

 Family Faces Boycott over Corona  rumours in Jharkhand - Sakshi

రాంచీ: కరోనా మహమ్మారే భయంకరమనుకుంటే ఈ వ్యాధి పేరుతో పుడుతున్న వదంతులు ఇంకా ప్రమాదంగా మారాయి. వీటి కారణంగా అనేకచోట్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్నటికి మొన్న కరోనా రోగులకు వైద్యం అందించిన డాక్టర్‌ ప్రాణాలు కోల్పోతే వదంతుల కారణంగా ఆయన అంత్యక్రియలను అడ్డుకున్నారు. ఇప్పుడు అదే వదంతుల కారణంగా జార్ఖండ్‌లోని ఒక కుటుంబం వెలివేతకు గురయ్యింది. చిన్నపిల్లలు ఆకలి అని ఏడుస్తున్న అక్కడ ఉన్న వారి మనసు కరగలేదు. (కరోనా సోకిందని వేధింపులు)

జార్ఖండ్‌లోని రాంగర్‌ జిల్లాలో ఒక కుటుంబం కరోనా పాజిటివ్‌ సోకిందనే వదంతుల కారణంగా ఐదు రోజులుగా సామాజిక బహిష్కరణకు గురయ్యింది. గోపాల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మురిద్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గీత దేవి జార్ఖండ్‌ స్టేట్‌ లైవ్లీ హుడ్‌ ప్రమోషన్‌ సోసైటీ ఆధ్వర్యంలో నడిచే దీదీ కిచెన్‌లో పనిచేస్తోంది. లాక్‌డౌన్‌ విధించిన నాటి నుంచి ఎంతో మంది పేదల కడుపు నింపుతోంది. ఈ నెల18వ తేదీన కొంతమంది గ్రామస్తులు గీత దగ్గరకు వచ్చి ఆమెకు కరోనా వైరస్‌ సోకిందని ఆరోపించారు. ఈ విషయంపై గీత మాట్లాడుతూ .... ‘నాకు కరోనా వచ్చిందని మీరు ఎలా చెబుతారు అని అడిగాను. వాళ్లు మీ బావమరిది చత్తీస్‌ఘడ్‌ నుంచి వచ్చాడు, అతని ద్వారా మీ కుటుంబానికి కరోనా సోకిందన్నారు. అలా ఎవరూ మా ఇంటికి రాలేదని నేను చెప్పడానికి ప్రయత్నించిన వాళ్లు వినలేదు. నన్ను ఆహారాన్ని పంచడానికి అంగీకరించలేదు. దీంతో మా కుటుంబం అంతా కరోనా పరీక్షలు చేయించుకున్నాం. పరీక్షల్లో కరోనా నెగిటివ్‌ అని వచ్చింది. అయినా గ్రామస్తులందరూ మమ్మల్ని వెలేశారు.  బయటకు వస్తే మా మీద ఎక్కడ దాడి చేస్తారో అని భయంగా ఉంది’ అని గీత ఆవేదన వ్యక్తం చేశారు. (కరోనా: నోట్లను ముట్టుకుంటే ఒట్టు)

గత ఐదు రోజులుగా వీరిని గ్రామంలో ఉండే మంచి నీటి పంపులు, కుళాయిల వద్దకు కూడా రానివ్వడం లేదు. దీంతో ఐదు రోజులు నుంచి అన్నం లేక ఇబ్బంది పడుతున్నారు. ఆహారం కోసం పిల్లలు ఏడుస్తున్న వీడియోని ఎవరో సోషల్‌మీడియాలో షేర్‌ చేయగా అది వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్‌ ప్రజలు ఎవరూ ఇలాంటి వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు. కరోనా కష్టకాలంలో ఇలాంటి భయాలకు, వదంతులకు ప్రజలందరూ కలిసి చెక్‌ పెట్టినప్పుడే ఈ మహమ్మారిని ఎదర్కొగలమని ఆయన చెప్పారు. గ్రామస్తులు ఇకపై ఇలా చేస్తే వారిపై కేసులు నమోదు చేశామని పోలీసులు హెచ్చరించారు. అయితే కొంత మంది గ్రామస్తులు మాత్రం వారికి కరోనా లేకపోతే ఎందుకు పరీక్షలు చేయించుకుంటారని అర్థంపర్థం లేకుండా వాదిస్తున్నారు. (ఏడేళ్ల జైలు.. 5 లక్షల జరిమానా)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top