వాస్తవాలను వక్రీకరిస్తున్నారు | facks havebeen misleaded, MoHRD smruthi irani on HCU insident | Sakshi
Sakshi News home page

వాస్తవాలను వక్రీకరిస్తున్నారు

Jan 21 2016 5:14 AM | Updated on Oct 22 2018 2:09 PM

వాస్తవాలను వక్రీకరిస్తున్నారు - Sakshi

వాస్తవాలను వక్రీకరిస్తున్నారు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్య ఘటనకు సంబంధించిన వాస్తవాలను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ అన్నారు.

- రోహిత్ ఉదంతంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

- ఇది దళిత, దళితేతరుల సమస్య కాదు

- దత్తాత్రేయ లేఖపై నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాం.. వర్సిటీకి ఐదుసార్లు రిమైండర్ పంపాం

- గతంలో కాంగ్రెస్ ఎంపీ వీహెచ్ కూడా ఇలాగే లేఖ రాశారు

- కమిటీ నివేదిక మేరకే వర్సిటీ విద్యార్థులపై చర్యలు తీసుకుంది.. నిజాలు త్వరలోనే తేలుతాయని వ్యాఖ్య

 

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్య ఘటనకు సంబంధించిన వాస్తవాలను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ అన్నారు. కొందరు చిత్రీకరిస్తున్న విధంగా ఇది దళితులు, దళితేతరుల మధ్య వివాదం కానే కాదని స్పష్టంచేశారు. బుధవారమిక్కడ కేంద్రమంత్రులు తావర్‌చంద్ గెహ్లాట్, నిర్మలా సీతారామన్‌తో కలసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ లేఖపై విశ్వవిద్యాలయానికి పలుమార్లు రిమైండర్లు పంపి ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలను స్మృతి కొట్టివేశారు. వర్సిటీకి రిమైండర్లు పంపడాన్ని సమర్థించుకుంటూ.. ఎంపీలు రాసిన లేఖలపై తమ మంత్రిత్వ శాఖ కార్యాలయ నియమావళికి లోబడి వ్యవహరిస్తోందని, ఈ నిబంధనలు యూపీఏ హయాంలో రూపొందించినవేనని చెప్పారు.

 

కేవలం దత్తాత్రేయ లేఖపైనే విశ్వవిద్యాలయానికి రిమైండర్లు పంపించామనడం సరికాదన్నారు. గతంలో కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు కూడా దత్తాత్రేయ మాదిరిగానే లేఖ రాశారని, అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు గత నాలుగేళ్లుగా ఆత్మహత్యలకు గురవుతున్నట్లు అందులో పేర్కొన్నారని వివరించారు. దత్తాత్రేయ లేఖపై విశ్వవిద్యాలయానికి ఐదు లేఖలు రాశామని, అయితే హనుమంతరావు లేఖపై 6 సార్లు లేఖలు రాసినట్లు పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని హనుమంతరావు తన లేఖలో పేర్కొన్నారని, అప్పట్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించి ఉంటే రోహిత్‌ను కోల్పోయే పరిస్థితి వచ్చేది కాదని స్మృతి అభిప్రాయపడ్డారు. రోహిత్ ఆత్మహత్య ఘటనను రాజకీయం చేయడం తగదని, బాధ్యతగా వ్యవహరించాలని విపక్షాలకు సూచించారు.

 

వివాదం కోర్టులో ఉంది..

వర్సిటీల్లో ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయని, ప్రస్తుత వివాదం కోర్టు విచారణలో ఉందని, పోలీసులు విచారణ జరుపుతున్నారని స్మృతి వివరించారు. త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకే వర్సిటీ కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ నివేదిక మేరకే రోహిత్ సహా ఐదుగురు విద్యార్థులపై చర్యలు తీసుకున్నారని, ఎగ్జిక్యూటివ్ సబ్ కమిటీలో సీనియర్ దళిత ఫ్యాకల్టీ సభ్యుడు కూడా ఉన్నారని చెప్పారు. విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయడానికి కోర్టు అంగీకరించలేదని గుర్తుచేసారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను కాంగ్రెస్ హయాంలోనే నియమించారని వ్యాఖ్యానించారు. రోహిత్ మరణం బాధాకరమని, అతడు తన సూసైడ్ నోట్‌లో ఎవరి పేర్లను ప్రస్తావించలేదని, హైద్రాబాద్ పోలీసుల నుంచి అందిన ఆ సూసైడ్ నోట్ ప్రతి తన వద్ద ఉందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement