ఇంజనీరింగ్‌ 75,000, లా పట్టా 2,00,000

Engineering for Rs 75000, Law Certificate for Rs 2 Lakh - Sakshi

నకిలీ సర్టిఫికెట్ల దందా గుట్టురట్టు

విచారణకు ఆదేశించిన మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ముంబై: కాలేజీకి వెళ్లే అవసరం లేదు..పరీక్షలు రాయాల్సిన పని అంతకన్నా లేదు.. రూ.75వేలు పెడితే ఇంజినీరింగ్‌ డిగ్రీ, రూ.2 లక్షలు మనవి కావనుకుంటే లా డిగ్రీ చేతికి అందుతుంది. ఒక్క 45 రోజులు ఓపిక పడితే ఏకంగా ఒరిజినల్‌ సర్టిఫికెట్లు చేతికి వచ్చేస్తాయి. న్యూస్‌18 రహస్య ఆపరేషన్‌లో ఈ చీకటి దందా వెలుగు చూసింది. 2016లో పూర్తి చేసినట్లుగా బీఏ డిగ్రీ పట్టా ఇచ్చేందుకు న్యూస్‌18 మీడియా వ్యక్తులతో నవీ ముంబైలోని కోపర్‌ఖైరానీ ప్రాంతానికి చెందిన కీ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీకి చెందిన ఏజెంట్‌ స్వప్నిల్‌ గైక్వాడ్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఈ డిగ్రీని యూజీసీ, ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ప్రముఖ వర్సిటీలు యశ్వంత్‌రావ్‌ చవాన్‌ యూనివర్సిటీ నుంచి గానీ సోలాపూర్‌ యూనివర్సిటీ నుంచి గానీ ఇస్తానన్నాడు. ఇందుకు 45 రోజుల సమయం పడుతుందని, 30 రోజుల తర్వాత డిగ్రీపట్టా జిరాక్స్‌ ప్రతులు, మరో 15 రోజుల తర్వాత ఒరిజినల్‌ పత్రాలను అందజేసేందుకు అంగీకరించాడు. ‘వర్సిటీకి గానీ, క్లాసులకు గానీ వెళ్లాల్సిన అవసరం లేదు. 2016లో డిగ్రీ పూర్తి చేసినట్లుగానే సంబంధిత పత్రాల్లో ఉంటుంది. వర్సిటీ రికార్డుల్లో కూడా ఇవి జత పరిచి ఉంటా యి.

ఇవి ఎక్కడా తనిఖీల్లో పట్టుబడేం దుకు అవకాశం  లేదు’ అని అతడు భరోసా ఇచ్చాడు. ఇంజినీరింగ్, ఎల్‌ఎల్‌బీతోపాటు వివిధ వర్సిటీల్లో పీహెచ్‌డీ చేసినట్లుగా కూడా సర్టిఫికెట్లు ఇస్తాం కానీ, ఫీజులు వేర్వేరుగా ఉంటాయన్నాడు. మూడేళ్ల ఇంజినీరింగ్‌ పట్టాకైతే రూ.75 వేలు, ఇందులో సగం ముందుగా, ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇచ్చాక మిగతా సొమ్ము ఇవ్వాల్సి ఉంటుంది. పీహెచ్‌డీ డిగ్రీలైతే ఆంధ్రా వర్సిటీ నుంచి ఇస్తామని చెప్పాడు. థీసిస్, సినాప్సిస్‌ కూడా అందజేస్తానన్నాడు.

యూపీలోని ఓ వర్సిటీ నుంచి పొందినట్లుగా ఉండే లా డిగ్రీకి రూ.2 లక్షలు ఖర్చవుతుందని గైక్వాడ్‌ చెప్పాడు. వర్సిటీల సంఖ్య పెరగడంతో తమ మార్కెట్‌ కూడా పెరిగిందని గైక్వాడ్‌ అన్నాడు. ప్రతి వర్సిటీకి టార్గెట్లున్నాయి. వాటి లక్ష్యం నెరవేరేందుకు మాలాంటి వారిని అవి ఆశ్రయిస్తున్నాయి. వర్సిటీలకు అడ్మిషన్లు కావాలి, మాకేమో డబ్బులు కావాలి’ అని తెలిపాడు. ఈ అంశంపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు  మానవవనరుల అభివృద్ధి శాఖ  మంత్రి పోఖ్రియాల్‌ ప్రకటించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top