వెల్లూరులో ఎన్నిక రద్దు

Elections to be canceled in Vellore Lok Sabha constituency in Tamil Nadu - Sakshi

భారీ ధన ప్రవాహం నేపథ్యంలో ఈసీ నిర్ణయం 

న్యూఢిల్లీ: డీఎంకే నేతకు సన్నిహితుడి వద్ద ఇటీవల భారీ మొత్తంలో నగదు పట్టుబడిన నేపథ్యంలో తమిళనాడులోని వెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ఉత్తర్వులిచ్చింది. డీఎంకే కోశాధికారి దురైమురుగన్‌ కొడుకు కథీర్‌ ఆనంద్‌ ఈ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థిగా ఉన్నారు. మార్చి 30న దురై మురుగన్‌ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను అధికారులు.. లెక్కలు లేని రూ. 10.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మరో రెండ్రోజుల తర్వాత, ఏప్రిల్‌ 1న దురైమురుగన్‌ సన్నిహితుడికి చెందిన సిమెంట్‌ ఫ్యాక్టరీలో సోదాలు చేసి, ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన రూ. 11.53 కోట్ల నగదును సైతం పట్టుకున్నారు.

దీంతో వెల్లూరులో స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగే వాతావరణం లేనందున ఈ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పరిణామంపై డీఎంకే, దాని మిత్రపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని మోదీ అన్ని స్వతంత్ర వ్యవస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించాయి. ధన ప్రవాహం భారీగా ఉందన్న కారణంతో ఓ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నిక వాయిదా పడటం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. వెల్లూరులో పోలింగ్‌ ఎప్పుడు నిర్వహించేది ఈసీ తర్వాత వెల్లడించే అవకాశం ఉంది. కాగా, అధికారులకు పట్టుబడిన రూ. 11.53 కోట్లలో 91 శాతం డబ్బు 200 రూపాయల నోట్ల రూపంలోనే ఉందనీ, అదంతా ఒకే బ్యాంకు శాఖ నుంచి తీసుకున్నదని ఆదాయపు పన్ను అధికారులు చెప్పారు.  

కనిమొళి ఇంట్లో ఐటీ సోదాలు 
చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడిలో డీఎంకే నాయకురాలు కనిమొళి ఇంట్లో ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. కనిమొళి తూత్తుకుడి స్థానం నుంచే బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు తమిలిసై సౌందరరాజన్‌తో పోటీ పడుతున్నారు. గురువారమే ఇక్కడ పోలింగ్‌ జరగనుంది. సోదాల్లో ఏం దొరికాయన్నది వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ మాట్లాడుతూ ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందనీ, స్వతంత్ర సంస్థలను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్లు, రాష్ట్రాలకు ఎన్నికల ప్రధానాధికారుల నియామకంలో సంస్కరణలు తెచ్చేందుకు తాము కృషి చేస్తామనీ, ఇందుకోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తామని ఆయన పేర్కొన్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top