‘అథ్లెట్ల మధ్య యుద్ధం కాదు ఇది’ | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఒలంపియన్ల మధ్య యుద్ధం!

Published Wed, Apr 3 2019 3:07 PM

Election Fight Between Athletes Rajyavardhan Rathore And Krishna Poonia In Rajasthan - Sakshi

జైపూర్‌ : లోక్‌సభ ఎన్నికల వేళ జైపూర్‌ రూరల్‌ పార్లమెంట్‌ స్థానం ఒలంపియన్ల మధ్య ‘యుద్ధాని’కి వేదిక అయ్యింది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున కేంద్ర మంత్రి రాజ్‌వర్థన్‌ సింగ్‌ పోటీ చేస్తుండగా.. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ క్రిష్ణ పునియాను బరిలో దింపింది. దీంతో ఒలంపిక్‌ క్రీడల్లో భారత దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఇద్దరు అథ్లెట్లు.. ప్రస్తుతం వేర్వేరు పార్టీల నుంచి బరిలో దిగడంతో అక్కడ ఆసక్తికర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో వీరి పోటీని ‘ఇద్దరు ఒలంపియన్ల మధ్య యుద్ధం’ గా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ విషయం గురించి సదులాపూర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే క్రిష్ణ పునియా మాట్లాడుతూ.. ‘ ఇది అథ్లెట్ల మధ్య యుద్ధం కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మా పార్టీ కృషి చేస్తోంది. యువత, మహిళలు, రైతు సంక్షేమం పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. కానీ చౌకీదార్లుగా చెప్పుకుంటున్న వ్యక్తులు జాతి సంపదను దళారులు దోచుకుంటుంటే ఏం చేస్తున్నారో. బహుశా వాళ్లు నిద్రపోతూ ఉంటారు’ అని ఎద్దేవా చేశారు.

కాగా 2004 ఏథెన్స్‌ ఒలంపిక్‌ క్రీడల్లో షూటింగ్‌ విభాగంలో సిల్వర్‌ మెడల్‌ సాధించిన రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌(49) 2013లో బీజేపీలో చేరారు. కామన్‌వెల్త్‌ క్రీడలు, పలు అంతర్జాతీయ చాంపియన్‌ షిప్‌లో అనేక పతకాలు సాధించిన ఆయన ప్రస్తుతం కేం‍ద్ర క్రీడా శాఖ మంత్రిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. జైపూర్‌ రూరల్‌ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న రాథోడ్‌ మరోసారి విజయం సాధించాలనే నిశ్చయంతో ఉన్నారు.

ఇక హర్యానాకు చెందిన క్రిష్ణ పునియా(36).. కామన్‌వెల్త్‌ క్రీడల్లో తొలి స్వర్ణం సాధించిన భారత మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించారు. మూడు సార్లు ఒలంపిక్‌ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆమె.. 2011లో పద్మశ్రీ పొందారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పునియా ఇటీవల జరిగిన రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సదులాపూర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం పార్టీ అధిష్టానం మేరకు ఆమె జైపూర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి రాథోడ్‌పై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఇద్దరు క్రీడాకారులు ఒకే ఏడాదిలో అంటే 2013లోనే రాజకీయాల్లో ప్రవేశించడం విశేషం.

Advertisement

తప్పక చదవండి

Advertisement