ఈసీ అనూహ్య నిర్ణయం..! | Sakshi
Sakshi News home page

ఈసీ అనూహ్య నిర్ణయం..!

Published Wed, May 15 2019 8:22 PM

EC Orders To Wind Up Campaign In West Bengal From Tomorrow - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మరో నాలుగు రోజుల్లో జరగనున్న ఏడో(చివరి) దశ పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల కమిషన్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో తొలిసారి ఆర్టికల్ 324ను ఉపయోగించిన కేంద్ర ఎన్నికల సంఘం ఒక రోజు ముందే అక్కడ ప్రచారం ముగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో రేపు సాయంత్రమే పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 19న బెంగాల్‌లో తొమ్మిది లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగనుంది. ఇక మంళవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా రోడ్‌షోపై రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దాడి చేశారని బీజేపీ ఆరోపించింది. బీజేపీ ఎన్నికల ప్రచారంపై రాళ్లదాడి ఘటనపై ఈసీ జోక్యం చేసుకోవాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు.
(చదవండి : అమిత్‌ షా ర్యాలీపై రాళ్లదాడి)

అధికారులపై కొరడా..
పశ్చిమ బెంగాల్‌లో అధికారులపై ఈసీ కొరడా ఝళిపించింది. సీఐడీ అడిషనల్‌ డీజీ రాజీవ్‌కుమార్‌ను కేంద్ర సర్వీసులకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని హోంశాఖలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ భట్టాచార్యపై కూడా ఈసీ బదిలీ వేటు వేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుని సీఈవోకు లేఖ రాయడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement
Advertisement