
న్యూఢిల్లీ: పర్వతాలు, అటవీ ప్రాంతాల్లో సైనిక చర్యలు, ఉగ్రదాడుల సమయంలో గాయపడే భద్రతా సిబ్బందిలో 90 శాతం మంది తక్షణ వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో జవాన్లను ఆస్పత్రికి తరలించేలోగా ఎంతో కీలకమైన ఆ గంట సమయంలో అందించాల్సిన అత్యవసర ప్రథమ చికిత్స కోసం కేంద్ర ప్రభుత్వం సంస్థ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్స్ లేబొరేటరీ (ఐఎన్‌ఎంఏఎస్) సరికొత్త వైద్య సాధనాలను రూపొందించింది.
గ్లిజరేటెడ్ సెలైన్.. ఇది అతి శీతలమైన –18 డిగ్రీల సెల్సియస్‌లో గడ్డకట్టదు. దీని ద్వారా గాయాల వాపు తగ్గిపోతుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే లోగా ఇది సమర్ధవంతంగా పనిచేస్తుంది. సెల్యులోజ్ ఫైబర్ డ్రెస్సింగ్.. గాయాలకు కట్టుకట్టే మామూలు డ్రెస్సింగ్ కంటే 200 రెట్లు అధికంగా శరీరంలో కలిసిపోయి రక్తాన్ని తక్కువగా శోషించుకునే గుణం ఉన్న డ్రెస్సింగ్ మెటీరియల్ ఇది. ఇది రక్తస్రావాన్ని ఆపడమే కాదు, యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది. చిటోసన్ జెల్.. గాయం నుంచి రక్తస్రావాన్ని నిలిపి వేసేలా కవర్ మాదిరిగా పనిచేస్తుంది.