‘లక్షణాలు లేకుంటే ఓకే’

Doctors Warn Of Recovered Covid-19 Patients Catching Infection - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ కొరియా, చైనాల తర్వాత భారత్‌లోనూ కోవిడ్‌-19 నుంచి కోలుకున్న రోగులు కొందరు తిరిగి ఇన్ఫెక్షన్‌కు గురైన కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. మొహాలీ ఆస్పత్రి నుంచి ఈ వారంలో డిశ్చార్జి అయిన 10 మంది రోగులకు తిరిగి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. హిమాచల్‌ప్రదేశ్‌లో మహమ్మారి నుంచి కోలుకున్న ఓ రోగికి తిరిగి పాజిటివ్‌ రాగా, కేరళలోనూ ఇలాంటి కేసులు వెలుగుచూశాయి. రక్తంలో తగినస్ధాయిలో యాంటీబాడీలు కలిగిన కోలుకున్న రోగులు తిరిగి ఎందుకు వైరస్‌ బారినపడుతున్నారనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. చండీగఢ్‌లో కోవిడ్‌-19 ఆస్పత్రిని నిర్వహిస్తున్న వైద్య నిపుణులు దీనిపై స్పందించారు. ఇన్ఫెక్షన్‌, వ్యాధి రెండూ వేర్వేరని, వైరస్‌ శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఇన్ఫెక్షన్‌ సోకుతుందని, వైరస్‌ ఎన్నో రెట్లు పెరిగి, వ్యాధినిరోధక శక్తిని అధిగమిస్తే వ్యాధికి దారితీస్తుందని పీజీఐ చండీగఢ్‌కు చెందిన ప్రొఫెసర్‌ అశిష్‌ భల్లా పేర్కొన్నారు.

రోగి వ్యాధినిరోధక శక్తి వైరస్‌ను అధిగమించినా కరోనా వైరస్‌ శరీరంలో ఉంటుందని, లక్షణాలు లేనంతవరకూ శరీరంలో వైరస్‌ కొద్దిపాటిగా ఉంటే అది వ్యాధి కాబోదని వివరించారు. వైరస్‌ చాలా వేగంగా స్వభావం మార్చుకుంటుందని, కొత్త స్ట్రెయిన్‌ అభివృద్ధి అయితే తిరిగి ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉందని..చైనా, దక్షిణ కొరియాల్లో ఇదే జరిగిందని ప్రొఫెసర్‌ భల్లా పేర్కొన్నారు. కోవిడ్‌ -19 నుంచి కోలుకున్న రోగులు పదిరోజులు ఐసోలేషన్‌లో ఉంటే ఆ తర్వాత వ్యాధి వారి నుంచి మరొకరికి వ్యాపించదని అకడమిక్‌ డీన్‌ ప్రొఫెసర​ జీడీ పూరీ వివరించారు. కోవిడ్‌-19 సంక్రమణను అడ్డుకుంటేనే వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని అన్నారు. ప్రజలు మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, సమూహాల్లోకి వెళ్లకపోవడం వంటి మూడు ప్రధాన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చదవండి : ఒడిశాలో మ‌ళ్లీ లాక్‌డౌన్ 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top