పాప కోసం బొమ్మకు ట్రీట్‌మెంట్‌

Doctors Used Doll To Treat 11 Month Old Baby In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కుప్పలు కుప్పలుగా బొమ్మలు ఉండడం సర్వసాధారణం. వాటితో ఆటలే చిన్నారులకు కాలక్షేపం. కొందరు పిల్లలకు బొమ్మలతో ఉండే అనుబంధం మాటల్లో చెప్పలేనిది.  పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకూ వాటితోనే ఆడతారు. తమకు ఇష్టమైన బొమ్మ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. పై ఫోటోలో ఉన్న చిన్నారి కూడా అలాంటిదే. తన బొమ్మ అంటే ఎంత ఇష్టమంటే.. ఆ బొమ్మకు ట్రీట్‌మెంట్‌ చేస్తేనే ఆమె కూడా బుద్ధిగా ట్రీట్‌మెంట్‌ చేయించుకుంటోంది. దీంతో చేసేది ఏమి లేక చిన్నారి బొమ్మను... పాపతో పాటే బెడ్‌పై పడుకోబెట్టి ట్రీట్‌మెంట్ చేశారు డాక్టర్లు.  ఈ విచిత్ర ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.
 
ఢిల్లీకి చెందిన  ఆ చిన్నారి పేరు జిక్రా మాలిక్. వయసు 11 నెలలు. జిక్రా దగ్గర ఓ అందమైన బొమ్మ ఉంది. పేరు పారీ.  పారీ అంటే జిక్రాకు ఎంతో ఇష్టం. అది లేనిదే ఏ పనీ చేయదు. బొమ్మకు పాలు పడితేనే జిక్రా పాలు తాగుతుంది. బొమ్మకు గోరుముద్దలు పెడితేనే జిక్రా తింటుంది. అదీ ఆ బొమ్మతో చిన్నారికి ఉన్న అనుబంధం. కాగా, ఆగస్టు 17న బెడ్‌పై నిద్రిస్తున్న సమయంలో అనుకోకుండా జిక్రా కిందపడింది. ఈ ఘటనలో ఆమె కాళ్లకు గాయాలు అయ్యాయి. దీంతో ట్రీట్‌మెంట్‌ కోసం ఆ చిన్నారిని ఢిల్లీలోని లోక్‌నాయక్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి మాత్రం వైద‍్యం చేయించుకోకుండా ఏడ్వడం మొదలెట్టింది. తల్లిదండ్రులు, డాక్టర్లు ఎంత సముదాయించినా ఆమె ఊరుకోలేదు. దీంతో జిక్రా తల్లికి ఓ ఆలోచన వచ్చింది. జిక్రాకు ఇష్టమైన బొమ్మను తీసుకొచ్చి మరో బెడ్‌ ఉంచి ట్రీట్‌మెంట్ చేసినట్లు నటించారు. దీంతో చిన్నారికి కూడా ట్రీట్‌మెంట్‌ తీసుకుంది. ఏడుపు ఆపేసి కామ్‌గా చికిత్సకు సహకరించింది. చిన్నారికి మందులు వేయాలన్నా, ఇంజెక్షన్‌ చేయాలన్న మొదటగా బొమ్మకు చేసినట్లు నటించి తర్వాత ఆమెకు చేస్తున్నారు.

‘జిక్రా ఇంట్లో కూడా బొమ్మను వదిలేది కాదు. ఎక్కడికి వెళ్లినా బొమ్మను తీసుకెళ్లేది. నిద్రపోయేటప్పడు కూడా బొమ్మను పక్కలోనే పడుకోబెట్టుకునేది. ఆస్సత్రికి వచ్చాకా  ట్రీట్‌మెంట్‌కు సహకరించలేదు. దీంతో నాకు బొమ్మ తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. వెంటనే మా ఆయనతో బొమ్మను తెప్పించి డాక్టర్లకు ఈ సలహా ఇచ్చాను. తన కాళ్లను ట్రీట్‌మెంట్‌ ఇచ్చేందుకు బొమ్మ కాళ్లును కూడా పైకి వేలాడదీసి కట్టేశాం. దీంతో జిక్రా కూడా కాళ్లను పైకి కట్టేస్తే బొమ్మలాగే ఉంది. ఏడుపు కూడా ఆపేసి ట్రీట్‌మెంట్‌కు సహకరిస్తుంది’  అని జిక్రా తల్లి మీడియాకు తెలిపారు. కాగా లోక్‌ నాయక్‌ ఆస్పత్రితో ఉన్న ఈ బుజ్ఞాయి ప్రస్తుతం సెలబ్రెటీగా మారిపోయింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top