‘కరుణ’ చూపుతారా? | Sakshi
Sakshi News home page

‘కరుణ’ చూపుతారా?

Published Tue, Jan 5 2016 8:36 AM

‘కరుణ’ చూపుతారా?

చెన్నై, సాక్షి ప్రతినిధి : రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఒక సర్వేలో తేలింది. డీఎంకే అధినేత కరుణానిధిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకే మెజార్టీ ప్రజలు మొగ్గుచూపుతున్నారని లయోలా కాలేజీ పూర్వ విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సర్వే స్పష్టం చేసింది.
 

 తమిళనాడులో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో లయోలా కాలేజీ పూర్వ విద్యార్థులు సర్వే నిర్వహిస్తున్నారు. ఎక్కువ సార్లు వీరి సర్వేకు తగినట్లుగా ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో లయోలా కాలేజీ పూర్వ విద్యార్థులు, పన్‌పాడు మక్కల్ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజాభిప్రాయాలను సేకరించారు. ఈ సర్వే వివరాలను సోమవారం చెన్నైలో మీడియాకు వివరించారు.

 రాబోవు ఎన్నికలపై గత ఏడాది నవంబరు 25వ తేదీ నుంచి  డిసెంబరు 25వ తేదీ వరకు సర్వే చేశారు. ఈ సర్వేలో 5176 మంది పాల్గొని ప్రజల మనోగతాలను తెలుసుకున్నారు. మద్యం అమ్మకాలు ప్రధాన సమస్యగా 25.8 శాతం మంది, ప్రభుత్వ శాఖల్లో అవినీతి 9.9 శాతంగా పేర్కొన్నారు. అలాగే తాగునీటి సమస్యపై 10.5, రోడ్డు వసతిపై 11.9 శాతం, వ్యవసాయ రుణాలపై 10.7శాతం, నిరుద్యోగంపై 15.6 శాతం స్పందించారు. ఈ స్థితిలో ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో డీఎంకే 33.9 శాతం, అన్నాడీఎంకే 31.5 శాతం, డీఎండీకే 14.4 శాతం, పీఎంకే 9.9 శాతం, ఎండీఎంకే 8.0 శాతంగా ఉన్నాయి. గత నాలుగున్నర సంవత్సరాల అన్నాడీఎంకే పాలన బాగుందని 32.5 శాతం మంది, ఘోరంగా ఉందని 39.3 శాతం మంది చెప్పారు.  రాబోయే ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తుపెట్టుకుంటాయని 29 శాతం మంది, ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కొట్టిపారేయలేమని 20 శాతం మంది, అవకాశం లేదని 39 మంది చెప్పారు. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా మరోపార్టీలు లే వని 56.4 శాతం మంది పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలోకి రావాలని 50 శాతం, మిశ్రమ పార్టీల ప్రభుత్వం రావాలని 29 శాతం మంది ఆశించారు. ముఖ్యమంత్రి  బాధ్యతల నిర్వహణలో సామర్థ్యాలపై ప్రశ్నించగా కరుణానిధికి 70.99 శాతం, స్టాలిన్‌కు 69.61, జయలలిత 65.99, విజయకాంత్ 31.73, అన్బుమణి 25.70, రాందాస్ 20.45, వైగో 18.79, తిరుమావళవన్ 18.75, జీకే వాసన్ 18.24, సీమాన్ 17.38 శాతంగా చెప్పారు. ప్రస్తుత రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితుల్లో ఎవరికి ఓటువేస్తారనే ప్రశ్నకు...డీఎంకే 35.6, అన్నాడీఎంకే 33.1, డీఎండీకే 6.0, ఎండీఎంకే 3.9, పీఎంకే 3.9 బీజేపీ 3.8, కాంగ్రెస్ 2.0, చెప్పలేమని 8 శాతం మంది పేర్కొన్నారు. జయపాలన కొనసాగాలా అనే ప్రశ్నకు వద్దని 38.8 శాతం, కొనసాగాలని 10.2 శాతం బదులిచ్చారు. రాబోవు ఎన్నికల్లో మూడో కూటమి గనుక ఓట్లను చీలిస్తే అన్నాడీఎంకే అనుకూలంగా మారుతుందని తేలింది. స్టాలిన్ చేపట్టిన నమక్కు నామే పర్యటన అతనిపై ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని కలిగించింది. విద్యాధికులైన యువతకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
 

 తమిళ సినీ పరిశ్రమకు చెందిన నటులు ప్రత్యేకంగా పార్టీ పెడితే ఎవరిని ఆదరిస్తారనే ప్రశ్నకు రజనీకాంత్‌కు 17.2 శాతం, కమలహాసన్ 10, విజయ్ 5, సీమాన్ 1 శాతం గా బదులిచ్చారు. తమిళనాడులో ప్రధాని నరేంద్రమోడీ పాలన ప్రభావంపై 30 మంది తృప్తిగా ఉందని, అసంతృప్తిగా ఉందని 65 శాతం మంది పేర్కొన్నారు.

Advertisement
Advertisement