కరుణానిధి దేవుడిని నమ్ముతారా? నమ్మరా?

Did You Know M Karunanidhi Did Not Believe In God? - Sakshi

చెన్నై : తమిళుల మదిలో ఎన్నటికీ చెరగని ముద్ర..  కలైజ్ఞర్‌, మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. నిన్న సాయంత్రం 6.10 గంటలకు స్వర్గస్తులయ్యారు. దీంతో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. కరుణానిధి ఆస్పత్రిలో ఉన్నంత కాలం, ఆయన త్వరగా కోలుకోవాలని, తిరిగి ఇంటికి రావాలని ప్రార్థన చేయని అభిమాని అంటూ లేరు. ప్రతి ఒక్కరూ కరుణానిధి కోలుకునేలా దేవుడు కరుణించాలని ప్రార్థించారు. కానీ అభిమానుల ప్రార్థనలు దేవుడికి వినిపించలేదో ఏమో.. కరుణను తన వద్దకే తీసుకెళ్లిపోయాడు. అసలు కరుణానిధి దేవుడిని నమ్ముతారా? మత సిద్ధాంతాల పట్ల ఆయనకున్న అభిప్రాయమేమిటి? అంటే పలు ఆసక్తికర విషయాలే వెలుగులోకి వచ్చాయి. 

సాంఘిక సమస్యలు తెరముందుకు వచ్చినప్పుడు కరుణానిధి అసలు మతపరమైన సిద్ధాంతాలను నమ్మరని, వాటిని తిరస్కరించే భావనను ఆయన కలిగి ఉండేవారని ద్రవిడ ఉద్యమంలో కీలక నాయకుడు పెరియార్ ఇ.వి. రామసామి చెప్పారు. అయితే పలు రిపోర్టుల ప్రకారం కరుణానిధి ఆలయ పోషకుడిగా ఉన్నారని తెలిసింది. తమిళనాడులో ఆలయాలను నిర్మించడం, ఉన్న వాటిని పునర్‌ నిర్మాణం చేయడం వంటి వాటిని కరుణా చేపట్టేవారట. ఆలయాల పునర్నిర్మాణం కోసమే ఈ నేత దాదాపు రూ.420 కోట్లను వెచ్చించారని తెలిసింది. మరోవైపు ద్రవిడియన్‌ పార్టీల్లో నాస్తిక రాజకీయ నాయకుడిగా కేవలం కరుణా నిధే నిలిచారట. నాస్తిక నాయకుడిగా కరుణానిధిగా పేరుందని తెలిసింది. కరుణానిధి నాస్తికుడైనప్పటికీ, ఆశ్చర్యకరంగా ఆయన నివాసం ఉండే ఇళ్లు కృష్ణుడి ఆలయం పక్కనేనట. కొన్ని దశాబ్దాలుగా కృష్ణుడి ఆలయం పక్కనే ఆయన నివసించేవారు.

ఈ డీఎంకే అధినేత ఇంటికి పూజారులు వస్తూ ఉండటం, వెళ్తూ ఉండటం, అన్నీ పూజా కార్యక్రమాలు జరపడం వంటివి చేసేవారట. ఓ సారి పూజారులు డీఎంకే అధినేత ఇంట్లో చేసిన పూజల వీడియో వైరల్‌ కూడా మారింది. ఆ వీడియో ఒక్కసారిగా వైరల్‌ అవడంతో, కరుణానిధిపై తీవ్ర విమర్శల వర్షం కురిసింది. ఆయన కలిగి ఉన్న మత వ్యతిరేక వైఖరిపై పలువురు పలు విమర్శలకు పాల్పడ్డారు. ‘నేను ఒక నాస్తికుడు అయినప్పటికీ, నా చుట్టూ ఉండే కొంతమంది, డిఎంకే పూర్తిగా ఆ భావజాలానికి కట్టుబడి లేదని నాకు బాగా తెలుసు. ప్రత్యేకించి దైవత్వం విషయంలో నా పార్టీ ఆలోచనలు, ఇతరులపై ఎలాంటి ఆంక్షలు విధించదు. నా కుటుంబం సభ్యులపై కూడా అలాంటి విధింపు ఉండదు’ అని ఒకానొక సమయంలో కరుణానిధి చెప్పారు. దీని ప్రకారం కరుణా నిధి నాస్తికుడిగా ఉన్నప్పటికీ, ఇతరుల నమ్మకాలకు పూర్తి విలువనిచ్చేవారని తెలిసింది. ఆయన దేవుడుని నమ్మనప్పటికీ, ఇతరుల విశ్వాసాలను మాత్రం వ్యతిరేకించేవారు కాదని తెలిసింది. కరుణా నిధి, ఆయన పార్టీ నేతలు కూడా ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత పలు దేవాలయాలను సందర్శించేవారట.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top