కమిషనర్‌గా కిరణ్‌బేడీ మళ్లీ రావాలి!!

Delhi Police vs Lawyers Some Want Kiran Bedi As Chief - Sakshi

న్యూఢిల్లీ : పార్కింగ్‌ విషయంలో ఢిల్లీ పోలీసులు, న్యాయవాదుల మధ్య తలెత్తిన వివాదం చినికిచినికి గాలివానలా మారింది. న్యాయవాదుల తీరును నిరసిస్తూ పోలీసులు ఆందోళన బాట పట్టారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద తమకు న్యాయం చేయాలన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. శనివారం నాటి ఘటనకు సంబంధించి వీడియో క్లిప్పింగ్‌ చూసి తప్పెవరిదో తేల్చాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిరసనకు ఐపీఎస్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. వివిధ రాష్ట్రాల పోలీసులు కూడా పెద్దఎత్తున వీరికి మద్దతు తెలుపుతున్నారు. ఆందోళన విరమించాలని ఉన్నతాధికారులు కోరుతున్నప్పటికీ తప్పు చేసిన వారిని గుర్తించి శిక్షించే వరకు ఆందోళన ఆపేది లేదని, దీనిపై రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులను కమిషనర్‌ పట్నాయక్‌ కేంద్ర హోంశాఖ అధికారులకు వివరించారు. ఈ ఘటనను సుమోటాగా తీసుకున్న ఢిల్లీ హైకోర్టు ఆదివారం విచారణ చేపట్టి, జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. స్పెషల్ కమిషనర్ (శాంతిభద్రతలు) సంజయ్ సింగ్‌‌ను సస్పెండ్ చేయడంతోపాటు పలువురు పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసింది. బార్‌ కౌన్సిల్‌ సభ్యులకు ఢిల్లీ హైకోర్టు సమన్లు పంపింది. 


గొడవ మొదలైంది ఇలా..!

తీస్ హజారీ కోర్టు వద్ద పార్కింగ్ విషయంలో పోలీసులకు లాయర్లకు మధ్య శనివారం గొడవ జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. అదే సమయంలో 40 మంది లాయర్లకు కూడా గాయపడ్డట్టు సమాచారం. ఈ ఘటనపై సీరియస్‌ అయిన ఢిల్లీ హైకోర్టు ఇద్దరు సీనియర్ పోలీస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరో ఇద్దరిపై వేటు వేయడమే కాకుండా గాయపడిన లాయర్లకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే లాయర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పోలీసులను బాధించింది. అదేవిధంగా సాకేత్ కోర్టులో ఓ పోలీసుపై పలువురు లాయర్లు దాడికి పాల్పడ్డారు. ఘర్షణకు పోలీసుల తీరే కారణమంటూ లాయర్లు సోమవారం నిరసన చేపట్టారు. లాయర్ల వల్లే ఘర్షణ వాతావరణం చోటుచేసుకుందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఘర్షణ తీవ్రం కావడంతోనే ముందు జాగ్రత్తగా గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు.

శాంతిభద్రతలను కాపాడాల్సిన ఖాకీలే న్యాయంకోసం
ఈ నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన ఖాకీలే, తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. అసాధారణరీతిలో రోడ్లపైకి రావడమే కాకుండా.. ఏకంగా పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుటే ఆందోళన చేపట్టారు. విధుల్లోకి రావాలంటూ సీనియర్ అధికారులు విజ్ఞప్తి చేసినా పోలీసులు పట్టించుకోలేదు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచి పోలీసులు నిరసనలు నిలిపివేయాలని కమిషనర్ పట్నాయక్ కోరారు.

సోమవారం కూడా పోలీసులపై లాయర్లు దాడి చేయడం అనేది క్షమించరానిదన్న కమిషనర్ దీనిపై చట్టపరంగా పోరాడుదాం అని పిలుపునిచ్చారు. సంఘటన జరిగిన వెంటనే కొంతమంది పోలీసులు మాత్రమే నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ వార్త దావానంలా వ్యాపించడంతో వందల సంఖ్యలో పోలీసులు తమ విధులకు బ్రేక్ ఇచ్చి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకుని గొంతును కలిపారు. ఉన్నతాధికారులు స్పందించేవరకు వెనక్కి తగ్గేది లేదని పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో ఆ ఏరియాలో ట్రాఫిక్ నిలిచిపోయింది. గంటగంటకు నిరసనలో పాల్గొనే పోలీసుల సంఖ్య పెరిగిపోతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అంతేకాకుండా ఒక మార్గాన్ని ట్రాఫిక్ పోలీసులు మూసివేయడం జరిగింది.

కిరణ్ బేడీ మళ్లీ రావాలి అంటూ పోలీసుల నినాదాలు
పోలీస్‌​​​​​​ హెడ్ క్వార్టర్స్ దగ్గర నిరసనకు దిగిన పోలీసు సిబ్బంది.. ఢిల్లీ సీపీ (కమిషనర్ ఆఫ్ పోలీస్) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటి పోలీసులకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. సీపీ అంటే ఎలా ఉండాలి.. కిరణ్ బేడీలా ఉండాలి అంటూ నినాదాలు చేశారు. కమిషనర్ గా మీరే కావాలంటూ దేశంలోనే తొలి మహిళా ఐపీఎస్ కిరణ్ బేడీ ఫొటోలతో ప్లకార్డులు ప్రదర్శించారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. తాము నిరసనలు చేపట్టేందుకు రాలేదని తమ బాధను పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు వచ్చామని కొంతమంది పోలీసులు చెప్పారు. న్యాయవృత్తిలో ఉన్నవారే పోలీసులపై చేయి చేసుకుంటే సామాన్య ప్రజలు తమను లెక్కచేస్తారా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top