
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో చార్జీల పెంపుపై కేంద్రం, ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ సర్కార్‌ల మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. ఓలా, ఊబర్ వంటి ప్రైవేట్ ఆపరేటర్ల లబ్థి కోసమే చార్జీల పెంపు కుట్ర జరిగిందని ఆప్ ఆరోపించింది. ప్రజల సొమ్ముతో చేపట్టిన మెట్రోలో ప్రయాణీకులపై భారం మోపడం తగదని, ఓలా, ఊబర్‌లకు మేలు చేసేందుకు కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరించిందని విమర్శించింది. ఢిల్లీ మెట్రోను ప్రతిష్టాత్మక ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఆప్ సర్కార్‌ను అనుమతించడం లేదని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆవేదన వ్యక్తం చేశారు.
మెట్రో చార్జీలు అధికంగా ఉంటే ప్రజలు క్యాబ్‌లవైపు మొగ్గుచూపుతారని ఫలితంగా ఢిలీల్లో కాలుష్య స్థాయిలు మితిమీరుతాయని అన్నారు. కాగా కేంద్రం అంగీకరిస్తే మెట్రోను తాము చేపడతామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తమ ఆస్తులు, వనరులను సమర్ధంగా వాడుకుంటే మరోసారి చార్జీలను పెంచాల్సిన అవసరం తలెత్తేది కాదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రో చార్జీలను పెంచడం పట్ల ప్రయాణీకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.