జయ ఆస్తుల తనిఖీ బాధ్యత దీప, దీపక్‌లకు

Deepa, deepak to Scrutiny Jayalalithaa Assets - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఈసీ, న్యాయస్థానంలో దాఖలు చేసిన జాబితా ప్రకారం దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను సరిచూసే బాధ్యతను ఆమె అన్న కుమారుడు దీపక్, కుమార్తె దీపలకు మద్రాసు హైకోర్టు మంగళవారం అప్పగించింది. దక్షిణ చెన్నై జిల్లా జయలలిత పేరవై సహాయ కార్యదర్శి పుహళేంది, జానకిరామన్‌ కోర్టులో దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌లో వివరాలు ఇలా ఉన్నాయి. జయలలితకు రూ.55 కోట్ల ఆస్తులున్నట్లు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ సమయంలో బెంగళూరు కోర్టు తీర్పులో పేర్కొంది. సుప్రీంకోర్టు సైతం నిర్ధారించింది. అయితే జయ ఆస్తుల ప్రస్తుత విలువ రూ.913.41 కోట్లు. అవన్నీ చట్టవిరుద్ధంగా థర్డ్‌పార్టీ స్వాధీనంలో ఉన్నాయి.

వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని భద్రం చేయాలి, ఒక పద్ధతిలో వాటిని నిర్వహించాలని పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరిస్తూ మద్రాసు హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని అదే కోర్టులో వారు అప్పీలు చేశారు. ఈ అప్పీలు పిటిషన్‌ను న్యాయమూర్తులు కృపాకరన్, అబ్దుల్‌ఖద్దూస్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ముందుకు విచారణకు వచ్చింది. జయలలిత రెండోతరం వ్యక్తులైన దీపక్, దీపలను ఈ పిటిషన్‌పై బదులివ్వాల్సిందిగా ఆదేశించింది.

ఈకేసు మంగళవారం విచారణకు వచ్చింది. ఎన్నికల కమిషన్‌ ముందు జయలలిత దాఖలు చేసిన వివరాలు, ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పులో చూపిన ఆస్తుల వివరాలు సరిచూడాల్సిందిగా దీపక్, దీపలను కోర్టు ఆదేశించింది. కోర్టులో దాఖలు చేసిన ఆస్తుల వివరాల్లో ఏదైనా విస్మరించారా? అనేది గమనించాల్సిందిగా సూచించింది. ఈసీ లేదా కోర్టు దృష్టికి రాని ఆస్తులు ఏవైనా ఉంటే వాటి వివరాలతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించాల్సిందిగా ఆదేశిస్తూ వచ్చే ఏడాది జనవరి 2వ తేదీకి కేసును వాయిదా వేసింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top