భారత్‌లో నాలుగో మరణం

Death toll in India rises to 4 as 72-year-old dies in Punjab - Sakshi

కోవిడ్‌–19తో పంజాబ్‌ వ్యక్తి మృతి

మొత్తం కేసుల సంఖ్య 173

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. పంజాబ్‌కు చెందిన ఒక వ్యక్తి గురువారం కోవిడ్‌తో మృతి చెందాడు. ఆ వ్యక్తి వృద్ధుడని, అతడికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వైరస్‌ సోకినవారి సంఖ్య భారత్‌లో గురువారానికి 173కి చేరింది. ఇందులో 20కి పైగా కేసులు కొత్తగా నిర్ధారణ అయినవే. ఛత్తీస్‌గఢ్, చండీగఢ్‌ల్లో గురువారం తొలి కేసులు నమోదయ్యాయి. మార్చి 22 నుంచి వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ విమానాలు భారత్‌లో దిగవద్దని కేంద్రం నిషేధం విధించింది. అత్యవసరంకాని సేవల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసుకునే వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది.  

ప్రజా రవాణా బంద్‌
పలు రాష్ట్రాలు దాదాపు లాక్‌డౌన్‌ స్థాయిలో ఆంక్షలు విధించాయి. కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ప్రజా రవాణాను నిషేధించారు. పంజాబ్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌పై నిషేధం విధించింది. రెస్టారెంట్లు, హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లను మూసేయాలని ఆదేశించింది. హోం డెలివరీ, టేక్‌ అవే సర్వీసులకు మాత్రం మినహాయింపునిచ్చింది. 20కి మించిన సంఖ్యలో ప్రజలు గుమికూడదని స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా రెస్టారెంట్లు మూసేయాలని ఆదేశించింది. అత్యవసరంకాని విధులను వాయిదా వేసుకోవాలని అన్ని ప్రభుత్వ, స్వతంత్ర సంస్థలకు, పీఎస్‌యూలకు విజ్ఞప్తి చేసింది.

అత్యవసరం కాని ప్రభుత్వ సేవలను కూడా శుక్రవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని ప్రముఖ సుందర్‌ నగర్‌ మార్కెట్‌ను కూడా మూసేయాలని వ్యాపారులు నిర్ణయించారు. ముంబైలోని ప్రముఖ భోజన సరఫరాదారులైన ‘డబ్బావాలాలు’ కూడా తమ సేవలను శుక్రవారం నుంచి మార్చి 31 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.  భారత్‌లో కరోనా వైరస్‌ సోకిన 173 మందిలో 25 మంది విదేశీయులు ఉన్నారు. గురువారం నాటికి మహారాష్ట్రలో 45, కేరళలో 27, హరియాణాలో 17, కర్ణాటకలో 14, రాజస్తాన్‌లో 7, లద్దాఖ్‌లో 8 కేసులు నమోదయ్యాయి. పలు ఇతర రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదయ్యాయి.

వైరస్‌ నుంచి రక్షణ పొందేందుకుగాను ప్రజలు రోజూ కనీసం 15 నిమిషాలపాటు ఎండలో గడపాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అశ్విని కుమార్‌ చౌబే సూచించారు. సూర్య రశ్మి ద్వారా శరీరానికి కావాల్సినంత విటమిన్‌ డీ లభిస్తుందని, తద్వారా శరీరరోగ నిరోధక శక్తి పెరిగి కరోనా వంటి వైరస్‌లను నిరోధించే అవకాశాలు పెరుగుతాయని అన్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top