‘గజ’ తుపాను మృతులు 59

cyclone Gaja rises to 59 deaths - Sakshi

దక్షిణ తమిళనాడులో భారీగా ప్రాణ, ఆస్తినష్టం

సాక్షి ప్రతినిధి, చెన్నై: దక్షిణ తమిళనాడుపై గజ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. తుపాను కారణంగా చనిపోయిన వారి సంఖ్య అనధికారిక లెక్కల ప్రకారం శనివారం నాటికి 59కి చేరింది. కొండచరియలు విరిగిపడటంతో కొడైకెనాల్‌లో నలుగురు చనిపోయారు. దాదాపు ఏడు జిల్లాల్లో ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం సంభవించింది. గజ తుపాను నాగపట్నం–వేదారణ్యం మధ్యన శుక్రవారం తీరం దాటిన విషయం తెలిసిందే. తీరం దాటుతున్న సమయంలో అత్యంత తీవ్రతతో వీచిన ఈదురుగాలులు, వర్షాలు కడలూరు, తంజావూరు, తిరువా రూరు, నాగపట్నం, దిండు గల్లు, పుదుక్కోటై, రామనాధపురం జిల్లాల్లో పెను విధ్వంసం సృష్టించాయి. ఈ తుపాను కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని కారైక్కాల్‌ జిల్లాలోనూ తీవ్ర ప్రభావం చూపింది. 

తంజావూరు, నాగపట్నం, తిరువారూరు జిల్లాల్లో రూ. 10 వేల కోట్లు నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. కొడైకెనాల్‌ పరిసరాల్లో 50కి పైగా ప్రాంతాల్లో రోడ్లు తెగిపోవడంతో, వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. 22 వేల ఇళ్లు పాక్షికంగాను, పూర్తిగాను దెబ్బతిన్నాయి. తుపానువల్ల తంజా వూరు, తిరువారూరు, నాగపట్నం, తదితర జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంటనష్టం సంభవించింది. కాగా, తుపాను సహాయ చర్యలను ప్రభుత్వం సమర్ధవంతంగా నిర్వహించడంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి. కాగా,  ఈ తుపాను వల్ల 36 మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. పుదుకోట్టైలో ఏడుగురు, కడలూరులో ముగ్గురు, నాగపట్నంలో నలుగురు, తంజావూరులో నలుగురు, తిరుచ్చిలో ఇద్దరు, దిండుగల్‌లో ఇద్దరు, శివగంగైలో ఇద్దరు సహా మొత్తం 36 మంది ప్రాణాలు కోల్పోయారని జాతీయ విపత్తు సహాయ దళం ప్రకటించింది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top