ఉల్లి దండలు మార్చుకున్న వధూవరులు

Couple Exchange Garland Of Onions Wedding Ceremony In Varanasi - Sakshi

వారణాసి : ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకాయి. ఉల్లి కోస్తేనే కాదు కొనాలంటే కూడా కన్నీళ్లు వస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలు ప్రజలను హడలెత్తిస్తుంటే.. సోషల్ మీడియాలో మాత్రం ఉల్లి నవ్వులు పూయిస్తుంది. నెటిజన్లు తమ క్రియేటివిటీ అంతా ఉల్లిపై చూపిస్తున్నారు. కామెడీ పండించే ఫొటోలు.. వీడియోలు షేర్‌ చేస్తూ ‘ఉల్లి’  జోకులు వేస్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ పెళ్లి జంట ఏకంగా ఉల్లి, వెల్లుల్లి దండలనే మార్చుకొని అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు పెళ్లికి వచ్చిన అతిథులు కూడా వారికి ఉల్లిపాయల్ని గిఫ్టులుగా ఇచ్చారు.

ఈ పెళ్లికి హాజరైన సమాజ్ వాదీ పార్టీ నేత కమల్ పటేల్ మాట్లాడుతూ..ఉల్లిధరలు దేశంలో ఎలా ఉన్నాయో జనాలకు సింబాలిక్‌గా తెలియజేసేందుకే వారు అలా ఉల్లిదండలను ధరించారని అందరూ అంటున్నారు. గత కొంతకాలం నుంచి ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. కిలో ఉల్లి రూ.120కి పైగా పలుతోందన్నారు. దీంతో ప్రజలు ఉల్లిపాయల్ని బంగారం కంటే ఎక్కువగా భావిస్తున్నారని అన్నారు. ఈ పెళ్లిలో వధూవరులు ఉల్లిపాయలు, వెల్లుల్లి దండలను మార్చుకుని వాటి రేట్లు ఎలా ఉన్నాయో ప్రదర్శించారని అన్నారు. మరో ఎస్పీ నేత సత్య ప్రకాష్ మాట్లాడుతూ..ఉల్లి రేట్లు అధికంగా ఉన్నందుకు వధూవరులిద్దరు ఈ రకంగా తమ నిరసనను తెలిపారని అన్నారు. ఉల్లికి వ్యతిరేకంగా ఇటువంటి కార్యక్రమాలను తమ పార్టీ నిరసనలు చేపడుతోందని తెలిపారు. 

కాగా, ఉల్లి ధరలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఇలాంటి వింత ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తమిళనాడుకు చెందిన ఓ నవ జంటకు పెళ్లి గిఫ్ట్‌గా రెండున్నర కిలోల ఉల్లిపాయలను అందించారు స్నేహితులు. కొన్ని కంపెనీలు తమ బిజినెస్‌ను పెంచుకునేందుకు కూడా ఉల్లిని వాడుకుంటున్నారు. తమిళనాడుకు చెందిన ఓ మొబైల్‌ కంపెనీ.. తమ కస్టమర్లకు కేజీ ఉల్లిని బహుమతిగా అందించాయి. కొన్ని చోట్ల కిలో చికెన్‌ కొంటే అరకిలో ఉల్లి ఫ్రీ అంటూ ఆఫర్లు ఇస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top