మా కూతుళ్లను నిర్బంధించారు.. విడిపించండి

Couple Came To GJ High Court Alleges Their Daughters Held In Swami Nithyananda Ashram - Sakshi

అహ్మదాబాద్‌ : స్వామి నిత్యానంద ఆశ్రమంలో నిర్బంధించిన తమ కూతుళ్లను విడిపించాలంటూ ఓ జంట గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించింది. తమ ఇద్దరు కూతుళ్లను తమకు అప్పగించాలని కోరుతూ సోమవారం పిటిషన్‌ దాఖలు చేసింది. వివరాలు... జనార్థన శర్మ దంపతులకు నలుగురు కూతుళ్లు ఉన్నారు. 2013లో వీరిని బెంగళూరులోని నిత్యానంద ఆశ్రమానికి చెందిన విద్యాసంస్థలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడికి వెళ్లి వస్తూ వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో శర్మ నలుగురు కూతుళ్లను నిత్యానంద ధాన్యపీఠం నుంచి అహ్మదాబాద్‌లోని యోగిని సర్వఙ్ఞాన పీఠానికి బదిలీ చేశారు. విషయం తెలుసుకున్న వీరు తమ కూతుళ్లను కలిసేందుకు వెళ్లగా... సర్వఙ్ఞాన పీఠ అధికారులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల సహాయంతో శర్మ దంపతులు ఆశ్రమానికి వెళ్లి తమ ఇద్దరు మైనర్‌ కూతుళ్లను ఇంటికి తీసుకువచ్చారు. అయితే మేజర్లైన మరో ఇద్దరు కూతుళ్లు లోముద్ర శర్మ(21), నందిత(18) తల్లిదండ్రులతో వచ్చేందుకు నిరాకరించారు. 

ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేసిన శర్మ దంపతులు.. తమ ఇద్దరు కూతుళ్లను ఆశ్రమ నిర్వాహకులు బెదిరించి.. తమతో రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని.. దయచేసి తమ అభ్యర్థనను మన్నించి తమ కూతుళ్లు ఇంటికి తిరిగి వచ్చేలా ఆశ్రమ నిర్వాహకులను ఆదేశించాలని కోర్టుకు విన్నవించారు. పోలీసుల సహాయంతో వారిద్దరినీ కోర్టు ఎదుట ప్రవేశపెట్టిన తర్వాత తమకు అప్పగించాలని కోరారు. కాగా స్వామీజీగా చెప్పుకొనే నిత్యానంద రాసలీల వీడియోలు బయటపడటంతో తీవ్ర ప్రకంపనలు రేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై పలు అత్యాచార కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇవి కర్ణాటక కోర్టులో విచారణలో ఉన్నాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top