
సీఎం గారి దగ్గు తగ్గింది..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెంగళూరు నుండి సోమవారం సాయంత్రం తిరిగి ఢిల్లీకి రానున్నారు.
బెంగళూరు: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెంగళూరు నుండి సోమవారం సాయంత్రం తిరిగి ఢిల్లీకి రానున్నారు. పన్నెండు రోజులు ప్రకృతి చికిత్స తరువాత తన ఆరోగ్యం కుదుట పడిందనీ, మళ్లీ పనిలో పడేందుకు ఉత్సాహంగా ఉన్నానంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఫ్రెష్ అండ్ ఫిట్ గా ఉన్నానన్నారు. ఈ సందర్భంగా జిందాల్ ఇన్సిస్ట్యూట్ డాక్టర్లకు, సిబ్బందికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఇలాంటి గొప్ప సంస్థలను దేశవ్యాప్తంగా నెలకొల్పాలని అభిప్రాయపడ్డారు కేజ్రీవాల్ . ఇస్కాన్ లోని అక్షయపాత్ర పథకం, మధ్యాహ్న భోజన పథకం తనను బాగా ఆకట్టుకున్నాయని తెలిపారు.
ముఖ్యంగా అక్కడి వంటగది చాలా శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి పథకాన్ని ఢిల్లీలో కూడా ప్రవేశపెడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నానని తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ 12 రోజుల విరామ సమయంలో ఢిల్లీలో ముఖ్యంగా విద్య మరియు ప్రజా పంపిణీ పథకాల (పీడీఎస్) గురించి బాగా ఆలోచించే అవకాశం దొరికిందినీ, ఈ విషయాల గురించి ఉపముఖ్యమంత్రి మనీష్ సి సోడియాతో చర్చించానని ఆయన ట్వీట్ చేశారు. విపరీతమైన దగ్గు, షుగర్ తో బాధపడుతున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గత మార్చి అయిదున ప్రకృతి చికిత్స కోసం బెంగళూరు వెళ్లిన సంగతి తెలిసిందే.