పల్లెలకు వ్యాపించకుండా చూడాలి

Coronavirus: Stopping Spread From Urban to Rural areas: Health Expert - Sakshi

బెంగళూరు: కరోనా మహమ్మారిని నగర ప్రాంతాల నుంచి పల్లెలకు వ్యాపించకుండా చూడటం కోవిడ్‌–19పై జరుగుతున్న యుద్ధంలో అత్యంత కీలకమైన అంశమని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా(పీహెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ శ్రీనాథ్‌ రెడ్డి తెలిపారు. ‘నగరాల నుంచి పల్లెలకు.. హాట్‌స్పాట్ల నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు వీలైనంత వరకూ తగ్గించాలి’ అని శ్రీనాథ్‌ రెడ్డి పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. నిత్యావసర, రవాణా అవసరాలకు మాత్రమే ట్రాఫిక్‌ను పరిమితం చేయడం ద్వారా కరోనా వైరస్‌ను నియంత్రించవచ్చునని అన్నారు. దేశంలో యువ జనాభా ఎక్కువగా ఉండటం మరణాల రేటు తక్కువగా ఉండేందుకు ఒక కారణం కావచ్చునని ఆయన తెలిపారు. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత కూడా భౌతిక దూరం, ఫేస్ మాస్క్‌లు ధరించడం, చేతి పరిశుభ్రత సాధనను ప్రజలు కొనసాగించాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా ప్రజల చలన శక్తి తక్కువ కాబట్టి కరోనా వ్యాప్తి చెందే అవకాశం కూడా పరిమితంగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు.

కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచినప్పుడు, కచ్చితంగా ఎక్కువ కేసులు వెలుగు చూస్తాయన్నారు. పరీక్షల సంఖ్య శాతంగా, కొత్త కేసుల సంఖ్యను చూడాల్సి ఉంటుందని వివరించారు. దీన్నిబట్టి వైరస్‌ విజృంభణ ఎంత తీవ్రంగా ఉందో గమనిస్తూ ఉండాలన్నారు. ఎక్కువ ఉష్ణోగ్రతలో వైరస్‌ చనిపోతుందన్న వాదనకు స్పష్టమైన శాస్త్రీయ రుజువు లేదన్నారు. జూన్-జూలైలో భారతదేశంలో కోవిడ్‌-19 కేసులు పెరిగే అవకాశం ఉందనే దాని గురించి తమకు తెలియదన్నారు. అయితే, జూన్-జూలై నాటికి ఎక్కువ ఉష్ణోగ్రత, అధిక తేమ కలయిక కారణంగా ఇతర కరోనా వైరస్‌లు తక్కువ చురుకుగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. విద్య, శిక్షణ, పరిశోధన, విధాన అభివృద్ధి, ఆరోగ్య కమ్యూనికేషన్, సలహాల ద్వారా దేశంలో ప్రజారోగ్య సామర్థ్యాన్ని పెంపొందించడానికి పీచ్‌ఎఫ్‌ఐ కృషి చేస్తోంది. (కరోనా: బెంగాల్‌లో అందుకే అధిక మరణాలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top