హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతిపై నిషేధం

coronavirus outbreak India bans export of key malaria drug - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ:  కరోనా బారిన పడిన  రోగులకు చికిత్స చేయడంలో  యాంటి మలేరియా డ్రగ్  సమర్థతంగా పనిచేయనుందన్న అంచనాల మధ్య భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ కరోనా వైరస్ నివారణలోహైడ్రాక్సీ క్లోరోక్విన్  మందును  పరీక్షిస్తున్న నేపథ్యంలో ఈ మందుల ఎగుమతిని నిషేధిస్తున్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించింది. ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచం మొత్తం గజ గజలాడుతోంది. మరో  వైపు ఈ వ్యాధి చికిత్సకు ఎటువంటి మందుగానీ, వాక్సీన్‌గానీ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. దీంతో ఇప్పటికే అందుబాటులో ఉన్న కొన్ని చికిత్సలపై పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా వాటిపై పని చేస్తున్నారు. ఈ క్రమంలో  ప్రస్తుత రోగులలో చాలామందికి  హైడ్రాక్సీ క్లోరోక్విన్  పనిచేస్తున్నట్టు  తేలింది.

అయితే క్లోరోక్విన్ కొంతమంది రోగులలో దుష్ప్రభావాన్ని చూపుతోందని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్  ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ దువా రాయిటర్స్‌తో చెప్పారు. దీనిపై జాగ్రత్తగా వ్యవహరించాలని.. ఈ మందు పనిచేస్తుందని నిరూపించడానికి సమగ్ర డేటా అందుబాటులో లేదని తెలిపారు. భారతదేశంలో ఈ మందుల కొరత  లేనప్పటికీ కంపెనీలు సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజా హెచ్చరికలు జారీచేసినట్టు  వ్యాఖ్యానించారు.  భారత ప్రభుత్వం  విధించిన 21 రోజుల లాక్ డౌన్ కారణంగా ఆయా ఔషధ కంపెనీలు కార్యకలాపాల నిర్వహణ కష్టమని పేర్కొన్నారు. ఇది ఇలా వుంటే హైడ్రాక్సీక్లోరోక్విన్ కొరత ఉందని  అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్-సిస్టమ్ ఫార్మసిస్ట్స్ (ఏఎస్ హెచ్ పి) ఈ వారం ప్రారంభంలో ఆందోళన వ్యక్తం చేసింది. దీనికితోడు వ్యాధితో బాధపడుతున్న వారికి సేవలు చేస్తున్న హెల్త్ వర్కర్లు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును వాడవచ్చు అని ఇటీవల ఐసీఎంఆర్ పేర్కొన్నది. ఇంట్లో క్వారెంటైన్ అయిన వ్యక్తి పట్ల కేర్ తీసుకుంటున్న వారు మాత్రమే ఈ మాత్రలను వేసుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది.

కాగా  ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధాల సరఫరాదారుగా ఉన్న భారతదేశం ఈ నెలలో 26 రకాల ఔషధ పదార్ధాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. జ్వరానికి, నొప్పులకు వాడే పారాసిటమాల్ సహా అసిటమినోఫెన్‌లాంటి మందుల ఎగుమతులను నిషేధించింది. దేశంలో  వెంటిలేటర్లు,  శానిటైజర్లు మాస్క్ లు,  దుస్తులు వంటి వ్యక్తిగత రక్షణ వస్తువులకు భారీ డిమాండ్ ఏర్పడటంతో వీటి ఎగుమతులను కూడా భారత్ ఇప్పటికే  నిషేధించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top