ఒక టీస్పూన్‌ లాలాజలంలో యాభై వేల కోట్లు వైరస్‌!

Corona virus: Symptoms Spread From Sneeze Or Cough! - Sakshi

అంటుకుంటే వదలదు...అక్షరాలా.. యాభై వేల కోట్లు! కోవిడ్‌ బాధితుడి ఒక టీస్పూన్‌ లాలాజలంలో ఉండే కరోనా వైరస్‌ల సంఖ్య ఇది. ఒక్క దగ్గు లేదా తుమ్ము చాలు.. ఈ వేల కోట్ల వైరస్‌లలో కొన్ని తుంపర్లతో కలిసి పరిసరాల్లోకి చేరిపోయేందుకు.. ఆ క్షణంలో ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నా సరే.. కొంచెం అటుఇటుగా 32,456 వైరస్‌లు నోరు, గొంతు పైపొరల్లోకి చేరిపోతాయి. ఆ సెకను నుంచి శరీరంలో వైరస్‌లు ఇబ్బడిముబ్బడి కావడం మొదలవుతుంది. ఆ తరువాత ఒక్కో దశలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే..కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వాలు ఇంతటి కఠిన చర్యలు ఎందుకు తీసుకుంటున్నాయో ఇట్టే అర్థమైపోతుంది.

సాక్షి, న్యూఢిల్లీ :  కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) బాధితుడు ఒక్కసారి తుమ్మినా, దగ్గినా కోటానుకోట్ల వైరస్‌లు పరిసరాల్లోని ఉపరితలాలపై చేరిపోతాయి. చేతిని అడ్డం పెట్టుకుని ఉంటే ఆ చేతులతో తాకిన ప్రతిచోటా వైరస్‌ ఉండిపోతుంది. ఉపరితలాన్ని బట్టి ఈ వైరస్‌ రెండు గంటల నుంచి మూడు రోజుల పాటు సజీవంగా ఉంటుందని ఇటీవలే అమెరికాలో జరిగిన పరిశోధన ఒకటి స్పష్టం చేసింది. అంటే.. తరచూ చేతులు శుభ్రం చేసుకుంటున్నా.. మనుషులకు మీటర్‌ ఎడంగానే ఉంటున్నా కొంచెం కష్టమైనా సరే.. బలవంతంగా చేతులను ముఖానికి తాకకుండా జాగ్రత్త పడుతున్నా కూడా వైరస్‌ బారిన పడే అవకాశాలు ఇంకా మిగిలే ఉంటాయన్నమాట. ఒక్కసారి ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశించిన తరువాత వైరస్‌ ఎలా ప్రవర్తిస్తుంది? ఎంత చేటు తెస్తుందన్నది చూస్తే... (కరోనా వ్యాప్తి: మాస్క్.. మాఫియా..!)

తుమ్మినా... దగ్గినా..మాట్లాడినా డేంజరే...
కరోనా వైరస్‌ బాధితుడు ఒక్క మాట మాట్లాడితే చాలు.. అతడి గొంతు నుంచి పైకి వచ్చే గాలి ద్వారా వైరస్‌లతో కూడిన చిన్నచిన్న తుంపరలు బయటకు వచ్చేస్తాయి. కొన్ని వైరస్‌లు ఇతరులు తినే ఆహారంపై చేరిపోవచ్చు. మరికొన్ని వేళ్లమధ్యలో ఉండిపోవచ్చు. మరికొన్ని ముక్కు ద్వారా సైనస్‌లోకి చేరి మళ్లీ గొంతులో స్థిరపడిపోవచ్చు. ఈ దశలో ఒక్క షేక్‌హ్యాండ్‌ ఇచ్చినా సరే.. అవతలి వ్యక్తి చేతులపై కనీసం 43,654 వైరస్‌లు పోగుపడతాయని, షేక్‌హ్యాండ్‌ పూర్తయ్యేసరికి ఈ సంఖ్య 3,12,405కు చేరుతుందని అంచనా. ఇప్పుడు గొంతులో మిగిలిపోయిన వైరస్‌ల సంగతి చూద్దాం. కొన్ని వైరస్‌లు లాలాజలపు చుక్కలతో కలిసి ఊపిరితిత్తుల్లోని ఒక కొమ్మపై చేరిపోతాయి. వెచ్చగా, తడిగా ఉండే కణజాలంపై ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. ఈ వైరస్‌లు ఎంత సూక్ష్మస్థాయిలో ఉంటాయంటే.. మన వెంట్రుకను ఫుట్‌బాల్‌ మైదానం అంత సైజుకు పెంచితే వైరస్‌ సైజు నాలుగు అంగుళాలు మాత్రమే ఉండేంత! (జనతా కర్ఫ్యూ: 14 గంటల్లో ఏం జరగబోతుంది?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top