పలు ప్రాంతాల్లో మూడోదశకు కరోనా: ఎయిమ్స్‌

Corona Virus Community Transmission Began In Some Areas Says AIIMS Director - Sakshi

ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వైరస్‌ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా పాజిటివ్‌ కేసుల సంఖ్యతో పాటు వైరస్‌ సోకి మృతి చెందిన వారి సంఖ్యా నానాటికీ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పలు కీలక విషయాలను వెల్లడించారు. దేశంలో పలు ప్రాంతాల్లో కరోనా వైరస్‌  రెండో దశను దాటి మూడో దశకు చేరుకుందని ప్రకటించారు. అయితే మూడో దశ దేశ వ్యాప్తంగా కేవలం కొన్ని ప్రాంతాల్లోనే మాత్రమే ఉందని తెలిపారు. (మూడో దశకు సిద్ధంగా ఉండండి)

సోమవారం ఓ కార్యక్రమంలో డాక్టర్‌ రణ్‌దీప్‌ మాట్లాడుతూ.. ‘దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరగడం ఆందోళనకరం. పలు ప్రాంతాల్లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ (లోకల్‌ కాంటాక్ట్‌) ద్వారా వైరస్‌ సోకడాన్ని గుర్తించాం. దీనిని వైరస్‌ మూడోదశగా చెప్పుకోవచ్చు. అయితే ఈ దశ దేశంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే విస్తరించింది. దేశ వ్యాప్తంగా అత్యధిక భాగం కేవలం రెండోదశలో ఉండంటం కొంత ఉపశమనం కలిగించే అంశం. అయితే మూడోదశ అనేది మన దేశంలో ప్రస్తుతం ప్రారంభదశలోనే ఉంది. దానిని అదుపుచేయడానికి ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంటున్నాం. దానిని ఎంత త్వరగా అరికడితే అంతమంచింది. లేకపోతే మూడోదశ ఉధృతమైతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదు.’ అని అన్నారు. (26 మంది నర్సులు, ముగ్గురు డాక్టర్లకు కరోనా!)

ఇక ఢిల్లీలోని మర్కజ్‌ మత ప్రార్థనాల కారణంగానే దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయని రణ్‌దీప్‌ తెలిపారు. ప్రార్థనల్లో పాల్గొన్న వారిని గుర్తించడం కష్టతరమైనప్పటికీ.. ప్రభుత్వాలు చర్యలు సఫలమైయ్యాయని పేర్కొన్నారు. వైరస్‌ కట్టడికి వైద్యులకు ప్రజలు సహకరించాలని కోరారు. మరోవైపు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేయడం గురించి సరైన నిర్ణయం చెప్పలేమని, ఏప్రిల్‌ 10 తరువాత పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పిస్తామని స్పష్టం చేశారు. కాగా సోమవారం నాటికి దేశ వ్యాప్తంగా 4వేలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య 109కి చేరింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top