కరోనా కల్లోలం: వైరస్‌ బారిన 26 మంది నర్సులు, డాక్టర్లు

Mumbai Hospital Declared Containment Zone Nurses Doctors Tested Covid 19 Positive - Sakshi

ముంబై: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. సామాన్యులతో పాటు కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది సైతం మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఏకంగా 26 మంది నర్సులు, ముగ్గురు డాక్టర్లకు ప్రాణాంతక వైరస్‌ సోకడం కలకలం సృష్టించింది. ఈ ఘటన ముంబైలోని ది వాక్‌హార్డ్‌ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. దీంతో బ్రిహాన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ)ఆ ఆస్పత్రిని నిషేధిత ప్రాంతంగా ప్రకటించింది. ఆస్పత్రిలోని కరోనా పేషెంట్లందరూ కోలుకునేంత వరకు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ఓ అధికారి జాతీయ మీడియాతో పేర్కొన్నారు.(క‌రోనాపై అసత్య ప్రచారం: వ‌్య‌క్తి అరెస్టు)

‘‘భారీ సంఖ్యలో వైద్య సిబ్బంది వైరస్‌ బారిన పడటం దురదృష్టకరం. వారు జాగ్రత్తలు తీసుకోవాల్సింది’’అని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వారందరినీ వివిధ ఆస్పతుల్లోని క్వారంటైన్‌లకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా సదరు ఆస్పత్రిలోని దాదాపు 270 మంది సాధారణ రోగుల నమూనాలు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపించినట్లు తెలిపారు. ఇక ఆస్పత్రి యాజమాన్యం అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్లే పదుల సంఖ్యలో నర్సులు మహమ్మారి బారిన పడ్డారని నర్సుల సంఘం ఆరోపించింది. అయితే కరోనా కేసులపై ఇంతవరకు స్పందించని ఆస్పత్రి యాజమాన్యం.. నర్సుల ఆరోపణలను మాత్రం కొట్టిపారేసింది.(పిల్లి కోసం పోలీసులపై హైకోర్టులో పిటిషన్‌)

కాగా తాజా సమాచారం ప్రకారం మహారాష్ట్రలో మొత్తం 42 మంది డాక్టర్లు, 50 మంది వైద్య సిబ్బందిని క్వారంటైన్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి సదరు ఆస్పత్రికి వచ్చాడని.. అప్పటికే అతడికి కరోనా సోకిన కారణంగా ఆస్పత్రిలో వైరస్‌ వ్యాప్తి చెందినట్లు భావిస్తున్నామని డాక్టర్‌ డీవై పాటిల్‌ మెడికల్‌ కాలేజీ, హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ డీన్‌ జితేంద్ర భవాల్కర్‌ తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top