అసెంబ్లీలో గ్రెనేడ్‌.. లోకాయుక్తకు కత్తిపోట్లు

Congress MLA Enters Assembly With Grenade - Sakshi

పోలీసు అకృత్యాలకు నిరసనగానే గ్రెనేడ్‌ తెచ్చానన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

కత్తితో కర్ణాటక లోకాయుక్త ఆఫీస్‌లోకి వెళ్లిన కాంట్రాక్టర్‌

తిరువనంతపురం : తిరువాంచూర్‌ రాధాకృష్ణన్‌.. కేరళలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే.. మాజీ హోంమంత్రి కూడా.. బుధవారం ఆయన అసెంబ్లీకి ఓ కవర్‌లో గ్రెనేడ్‌ను తెచ్చారు.. సభలోకి వచ్చి కవర్‌ నుంచి దాన్ని బయటికి తీసి చూప డంతో సభ్యులంతా భయాందోళనలకు గురయ్యారు. రాష్ట్రంలో పోలీసుల అకృత్యాలకు నిరసనగానే ఇలా చేసినట్టు ఆయన వివరణ ఇచ్చారు.

యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు సుహైబ్‌ హత్యను నిరసిస్తూ ఆందోళనకు దిగిన తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు ప్రయోగించిన గ్రెనేడ్‌లలో ఒకదాన్ని తెచ్చానని వెల్లడించారు. గ్రెనేడ్‌ను రాధాకృష్ణన్‌ తానే భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీనిపై సీఎం విజయన్‌ సహా అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. రాధాకృష్ణన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కేరళ అసెంబ్లీలోకి బాంబులు తేవడం ఇది తొలిసారి కాదు. 2012లోనూ ఇలాగే పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ అప్పటి ప్రతిపక్ష సీపీఎం సభ్యుడొకరు 2 టియర్‌ గ్యాస్‌ షెల్‌ను సభలోకి తెచ్చారు. అప్పుడు రాధాకృష్ణన్‌ హోంమంత్రిగా ఉండటం గమనార్హం.

బెంగళూరు : కర్ణాటక లోకాయుక్త జస్టిస్‌ పి.విశ్వనాథ షెట్టిపై ఆయన కార్యాలయంలోనే దాడి జరిగింది.  గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బెంగళూరులోని విధాన సౌధ భవనం పక్కనే ఉన్న ఎంఎస్‌ బిల్డింగ్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే లోకాయుక్త కార్యాలయం ఉంది. బుధవారం ఉదయం తుమకూర్‌కు చెందిన తేజరాజ్‌ శర్మ(36) అనే కాంట్రాక్టర్‌ కార్యాలయానికి వచ్చాడు.

15 మంది ప్రభుత్వ అధికారులపై అవినీతి ఆరో పణలున్న ఫిర్యాదును అక్కడి అధికారులకు అందజేయగా.. ఆ కేసును మూసివేశారని వారు బదులిచ్చారు. దీంతో లోకాయుక్త చాంబర్‌లోకి వెళ్లిన శర్మ వెంట తెచ్చుకున్న కత్తితో జస్టిస్‌ విశ్వనాథ షెట్టిపై దాడి చేసి నాలుగైదు చోట్ల పొడిచాడు. ఆయన గట్టిగా కేకలు వేయటంతో సిబ్బంది వచ్చి వెంటనే ఆస్పత్రికి తరలించారు.

నిందితుడు శర్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విశ్వనాథ షెట్టిని సీఎం సిద్ధరామయ్య ఆస్పత్రిలో పరామర్శించారు. ఆయనకు ప్రాణహాని లేదని వైద్యులు తెలిపినట్లు చెప్పారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.. సీఎం సిద్ధ రామయ్యకు ఫోన్‌ చేసి ఘటనపై ఆరా తీశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top