‘నాకు టోపీ పెట్టకండి’

UP CM Yogi Refuse To Wear Cap At Kabir Mausoleum - Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ మరోసారి విపక్షాలకు మాట్లాడే అవకాశం కల్పించారు. హిందుత్వకి మారుపేరుగా చెప్పుకునే యోగి.. మఘర్‌లో ఉన్న ప్రసిద్ధ ప్రవక్త, కవి కబీర్‌ సమాధిని సందర్శించడానికి వెళ్లినప్పుడు ముస్లింలు ధరించే టోపీ / పగడీ ధరించడానికి నిరాకరించి విపక్షాలకు పని కల్పించారు. వివరాల ప్రకారం గురువారం(నేడు) కబీర్‌ ప్రవక్త 500వ వర్ధంతి వేడుకల సందర్భంగా ఆ మహాత్మునికి నివాళులు అర్పించడానికి ప్రధాని నరేంద్ర మోదీ మఘర్‌కు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది యూపీ ప్రభుత్వం. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు యోగినే స్వయంగా మఘర్‌కు వెళ్లారు.

ఆ సయంలో సమాధి నిర్వహకుడు ముస్లింలు ధరించే టోపీని యోగి తలపై పెట్టడానికి ముందుకు వచ్చాడు. కానీ టోపీ ధరించడానికి ఇష్టపడక వద్దని సున్నితంగా యోగి వారించారు. ముఖ్యమంత్రి చర్యను విపక్షాలు విమర్శిస్తున్నాయి. మతం పేరుతో యోగి సమాజాన్ని విడదీస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ‘ఆ టోపీ ఏ మతానికి చెందినది కాదు. అది కేవలం మర్యాదను సూచిస్తుంది. ముఖ్యమంత్రి అన్నాక అందరిని కలుపుకుపోవాలి. యోగి టోపీని ధరిస్తే బాగుండేద’ని కాంగ్రెస్‌ నాయకుడు ప్రమోద్‌ తివారి అన్నారు.

అయితే యూపీ మంత్రి వర్గంలోని ఏకైక ముస్లిం మంత్రి మొహ్సిన్ రాజా మాత్రం యోగీకి మద్దతు తెలిపారు. ‘ముఖ్యమంత్రికి టోపీ ఇవ్వడం.. ఆయన దాన్ని ధరించకపోవడం.. దాన్ని ప్రతిపక్షాలు ఇలా ప్రచారం చేయడం వీటన్నింటిని చూస్తుంటే మీరు ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నారో జనాలకు అర్ధం అవుతుంది. మీరు ‍ప్రజలకు ఏ సందేశం ఇద్దామనుకుంటున్నారు? నేను ఒక ముస్లింనే. కానీ నేను ఎప్పుడు టోపీ ధరించలేదు. అంతమాత్రాన నేను ముస్లింను కానా? టోపీని ధరించకపోవడం పెద్ద నేరమా? ఈ విషయం గురించి మాట్లాడేవారు ఆలయాలకు వెళ్లి ప్రజలతో పాటు నిల్చుని, వారిని శుభాకాంక్షలు తెలుపుతున్నారా? ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలను విలువివ్వడం... మతాన్ని అవమానించడం ఎలా అవుతుంది. ముందు మనం మన ఆలోచనల్ని మార్చుకోవాలి’ అన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top